ప్రజాశక్తి - చింతూరు
మండలంలోని తుమ్మల నారాయణపురం గ్రామాలలో రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన తుమ్మల సచివాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రాన్ని పంచాయతీ కార్యదర్శి దేవి ప్రియకు అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు మొట్టం రాజయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల పేమెంట్లను 15 రోజులలో చెల్లించాలని చట్టం చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ పరిధిలోని నారాయణపురం గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, మరమ్మతుకు గురైన మోటర్‌ను తక్షణమే బాగు చేయించి ప్రజలకు తాగునీరు అందివ్వాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, వీధిలైట్లు వేయాలని, విద్యుత్ వైర్లు కిందకు ఉన్నాయని, వాటిని సరి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సవలం పంతులు, మొట్టం రవికుమార్, పట్రా రాధాకృష్ణ, కోర దుర్గారావు, కురసా సుబ్బారావు, రవ్వ బుచ్చయ్య, మడకం లక్ష్మయ్య, సోడే నాగయ్య, పొడియం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.










