Nov 19,2022 23:32

గిరిజన సంఘం ఆధ్వర్యాన ధర్నా నిర్వహిస్తున్న ఉపాధి హామీ కూలీలు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఉపాధి హామీ కింద చేసిన పనికి కూలి సొమ్ము చెల్లించాలని కోరుతూ మండలంలోని లోదొడ్డి, వాతంగి పంచాయితీలకు చెందిన గిరిజనులు శనివారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఉపాధి హామీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తొలిత గ్రామంలో ర్యాలీ చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షులు కె.జగన్నాథం, సభ్యులు మేలిన రమేష్‌ మాట్లాడుతూ, లోదొడ్డి పంచాయతీ పరిధి పాక వెలితి, పూదేడు, కేశవరం, లోదొడ్డి, వాతంగి పంచాయితీలోని బట్టవారివీధి, ఓకుర్తి, ఓగి పాలెం, వాతంగి తదితర గ్రామాలలో అనేకమంది ఉపాధి కూలీలు పని చేసినప్పటికీ వారికి మూడు నెలలుగా కూలి డబ్బులు ఇవ్వలేదని తెలిపారు. ఆయా గ్రామాలలో ఉపాధి హామీ జాబ్‌ కార్డులు ఉన్నా వారికి పని ఇవ్వడం లేదని, అనేకమంది అర్హులైనవారు ఉన్నా జాబుకార్డు లేవని చెప్పారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా కలిగిన గిరిజన రైతులకు 150 రోజుల ఉపాధి పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం.మురళి, పి సత్యనారాయణ, పి రమణమ్మ, పి లక్ష్మి, ఆయా గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.