ప్రజాశక్తి - ప్రత్తిపాడు : సొంత ఊరులోనే పనులు కల్పించి వలసలను నివారించాలనే ఉద్దేశంతో తెచ్చిన ఉపాధి హామీ చట్టం క్రమంగా నిర్వీర్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో నిధుల్లో కోత విధించిన విషయం తెలిసిందే. దీని దుష్ఫలితం క్షేత్రస్థాయిలో మరింత ప్రస్ఫుటమవుతోంది. చట్ట ప్రకారం కల్పించాల్సిన పని దినాల కంటే సగానికి తక్కువగా గతేడాది పనులు కల్పించగా ఈ ఏడాది వాటిని మరింత తగ్గించారు.
ప్రత్తిపాడు మండలంలో 22 గ్రామాలు ఉండగా 49 వేల 390 మంది జనాభా ఉంటుందని అంచనా. మండలంలో 8059 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా వీటిల్లో యాక్టివ్ కార్డులు 5558గా అధికారులు పేర్కొంటున్నారు. చట్ట ప్రకారం ప్రతి కార్డుకూ 100 పని దినాలు కల్పిస్తే యాక్టిక్ కార్డుల ప్రకారం చూసినా 5 లక్షల 55 వేల 800 పనిదినాలు కల్పించాలి. అయితే గతేడాది కల్పించిన పని దినాలు 2 లక్షల 19 వేల 225 మాత్రమే. 3 లక్షల 36 వేల 575 పని దినాలను కూలీలు కోల్పోయారు. కల్పించిన పని దినాల్లోనూ 28,456 పని దినాలు గృహ నిర్మాణం కింద కేటాయించారు. అంటే జాబ్ కార్డు ఉన్నవారు ప్రభుత్వ పథకాల కింద ఇళ్లు నిర్మించుకుంటే ఒక్కో కార్డుకు 90 పని దినాల చొప్పున నగదును లబ్ధిదార్లకు చెల్లిస్తారు. ఈ విధంగా మండలంలో 607 మంది లబ్ధిదార్లకు 28,456 పని దినాలను గృహ నిర్మాణం కింద కేటాయించారు.
ప్రస్తుతం మండలంలో వ్యవసాయ పనులు మొత్తం అయిపోయాయి. మిర్చి కళ్లాల్లో తాలుగాయలు ఏరే పని పరిమితంగా మినహా ఎక్కువ మంది కూలీలు ఉపాధి కోసం నిరీక్షిస్తుండగా ఇటీవలే ఉపాధి హామీ పనులను అక్కడక్కడా ప్రారంభించారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు భవన నిర్మాణ పనులకు వెళ్తున్నారు. మళ్లీ ఖరీఫ్ మొదలయ్యే వరకూ ఉపాధి అస్తుబిస్తుగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనులు కల్పించాల్సిన అవసరం ఇప్పుడే ఎక్కువ. అయితే ఈ ఏడాది లక్ష్యం సగం వరకూ కుదించారు. గతేడాది మండలంలో ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్, మైనర్ ఛానల్స్, డ్రెయిన్లు, చెరువులు, రోడ్ల వెంట మొక్కల పెంపకం తదితరాలతోపాటు గృహ నిర్మాణంతో కలిపి 953 పనులు గుర్తించగా ఏడాది గుర్తించిన పనులు 515 మాత్రమే. పని దినాల లక్ష్యం సైతం లక్ష 61 వేల 136కు తగ్గింది. గతేడాది కల్పించిన పనులతో పోలిస్తే 58 వేల పని దినాల వరకూ తక్కువ. జులై తర్వాత లక్ష్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నా అప్పటికి వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది.
వాస్తవానికి గతంలో ఉపాధి హామీ పనుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలు చూసేవి. తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఇందుకు పూనుకుంది. ఇందులో భాగంగా అనేక కొత్త నిబంధనలు తెచ్చి పనులు లేకుండా చేయడం, కూలీలు పనికి రావాలంటే నిరుత్సాహానికి గురయ్యేలా చేయడం వంటి వాటికి పాల్పడుతోంది. గతంలో చెరువులు, కాల్వల పూడిక తీతలు అవసరాన్ని బట్టి ప్రతి ఏడాదీ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్త నిబంధన తెచ్చి ఒకసారి చేసిన పని మళ్లీ చేయడానికి వీల్లేకుండా చేస్తున్నారు. మండలంలో గుర్తించిన పనుల సంఖ్య దాదాపు సగానికి తగ్గడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. ఇదే తీరు కొనసాగితే రానున్న కాలంలో కూలీలకు ఉపాధి హామీ పనులు మరింతగా దూరం కానున్నట్లు తేటతెల్లమవుతోంది.










