Sep 16,2021 06:43

వామపక్ష పార్టీల మద్దతుతో కేంద్రం లోని యుపిఎ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసింది. పనులు దొరక్క పొట్ట చేత పట్టుకుని వలసపోయే కార్మికుల కోసం ఏర్పాటు చేసినదీ పథకం. దీని ప్రకారం ఒక కుటుంబానికి సంవత్సరంలో 100 పని దినాలు కల్పించాలి. పని చేసిన తరువాత 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని షెడ్యూల్‌- 2, పేరా 29 నిబంధన సూచిస్తున్నది. 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించకపోతే 16వ రోజు నుండి రోజుకు 0.05 శాతం నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెబుతున్నది.

సకాలంలోనే వేతనాలు చెల్లిస్తున్నాం కనుక ఎటువంటి నష్టపరిహారం చెల్లించనవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రాష్ట్రంలోని 2019ా2020, 2020ా2021, 2021ా2022 సంవత్సరాలలో ప్రభుత్వం చెల్లించిన ఉపాధి హామీ వేతనాల రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వాస్తవం కాదని, వేతనాలు చెల్లించడంలో ఆలస్యం అవుతున్నప్పటికి, కూలీలకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించడం లేదని నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని తన నివేదికలో పేర్కొన్నది.

గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపు రెండు దశలుగా ఉంటుంది. పని పూర్తి అయిన 8 రోజుల్లోగా నిధులు చెల్లించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపాలి. అనంతరం కేంద్ర ప్రభుత్వం కూలీల బ్యాంక్‌ ఖాతా లోకి 7 రోజుల్లోగా వేతనాలు జమ చేయాలి. పని పూర్తైన 15 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలి.

ఈ పద్ధతి ఏ విధంగా అమలు జరుగుతున్నదనే విషయం మీద రాష్ట్రంలోని మొత్తం 12,956 పంచాయతీలలో 130 పంచాయతీల (1శాతం)లో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ రాండమ్‌ సర్వే జరిపింది. 2020ా2021, 2019ా2020 సంవత్సరాలలో జాబ్‌ కార్డులు వారీగా బ్యాంక్‌లో జమ చేయబడిన వేతనాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపడం, కేంద్రం సకాలంలో వేతనాలు చెల్లింపు గురించి పరిశీలించింది. దీని ప్రకారం చూస్తే 3.95 లక్షల జాబ్‌ కార్డులను పరిశీలించగా 34 శాతం జాబ్‌ కార్డుదారులకు 2021 ఆగష్టు 10 నాటికి వేతనాలు చెల్లించలేదని, కేవలం 130 పంచాయతీల్లో 2.58 లక్షల జాబ్‌ కార్డుదారులకు మాత్రమే వేతనాలు సకాలంలో చెల్లించడం జరిగిందని స్టాండింగ్‌ కమిటీ ఇటీవల తన నివేదికలో బహిర్గతం చేసింది.

రాష్ట్రం నుండి కేంద్రానికి నివేదిక పంపడంలో, కేంద్రం వేతనాలు జమ చేయడంలో నెల రోజులకు పైగా ఆలస్యం అవుతున్నదని, ఇది సరికాదని స్టాండింగ్‌ కమిటీ సూచించింది. చట్ట ప్రకారం 15 రోజుల్లో ఆ వేతనాలు చెల్లించాలనే నియమాన్ని తప్పకుండా అమలు చేయాలని సూచించింది. 20 శాతం కన్నా తక్కువ జాబ్‌ కార్డుదారులకు మాత్రమే నిబంధనల ప్రకారంగా వేతనాలు చెల్లిస్తున్నారని 3 శాతం పైగా జాబ్‌ కార్డుదారులకు రెండు నెలలు పైగా వేతనాల బకాయిలు ఉంటున్నాయని నివేదిక పేర్కొన్నది. దాదాపు సగం మంది జాబ్‌ కార్డుదారులకు వేతనాల చెల్లింపులో 30 రోజులు పైగా ఆలస్యం అవుతున్నదని, 31 రోజుల నుండి 45 రోజుల వరకు 10,763 (8.3 శాతం) జాబ్‌ కార్డుదారులకు, 46-60 రోజుల వరకు 17,638 (13.7 శాతం), 60 రోజుల పైన 38,405 (29.8 శాతం) జాబ్‌ కార్డుదారులకు వేతనాలు బకాయిలు వున్నాయని నివేదిక పేర్కొన్నది. 15 రోజుల్లోగా వేతనాలు చెల్లించాలన్న నియమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కేంద్రం ఇవ్వాల్సిన నిధులు నెలరోజులు పైగా బకాయిలు పెట్టింది. కరోనా కాలంలో పనులు తగ్గిపోయాయి. గత సంవత్సరం ఏప్రిల్‌-జులై కాలంలో 20.09 కోట్ల పని దినాలు కల్పించగా ఈ సంవత్సరం కేవలం 19.12 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించబడ్డాయి. సకాలంలో వేతనాలు చెల్లించాలని, పని దినాలు కూడా పెంచాలని స్టాండింగ్‌ కమిటీ సూచించింది.

పనులు పూర్తి అయిన తరువాత సకాలంలో వేతనాలు చెల్లించడంలో జరిగే జాప్యానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ఆలస్యానికి నష్టపరిహారం చెల్లించాలని, ఆ విధంగా చూస్తే ఏప్రిల్‌-జులై మధ్య కాలంలో 2021ా2022 ఆర్థిక సంవత్సరంలో రూ.26 కోట్లు, 2020ా2021 సంవత్సరంలో రూ.12 కోట్లు, 2019ా2020 సంవత్సరంలో రూ. 36 కోట్లు కేంద్రం నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉందని కూడా స్టాండింగ్‌ కమిటీ పేర్కొన్నది. ఉపాధి కూలీలకు వేతనాలు నెలల తరబడి బకాయిలు ఉంటున్నాయి. నష్టపరిహారం కూడా చెల్లించడం లేదు. అందువల్ల పని చేసిన కూలీలు పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక చట్టప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టులో ఒక స్వచ్ఛంద సంస్థ పిల్‌ వేయగా కూలీలకు నష్టపరిహారం తప్పని సరిగా చెల్లించాలని 2018 మే 18 తేదీన కోర్టు తీర్పు చెప్పింది.

'కరోనా రెండవ దశలో చాలా ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ప్రతిరోజు వేల కేసులు, కొన్ని సందర్భాలలో లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ పేదలను ఆదుకోవాలంటే ఉపాధి పని దినాలు 100 నుండి 200 రోజులకు పెంచి సకాలంలో వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం ఇస్తున్న రూ.245 వేతనం సరిపోదు. ధరలు పెరగడం వల్ల వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్నది. కనుక రోజుకి రూ.600 వేతనం చెల్లించాల'ని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. కరోనా వ్యాధి దేశమంతటా తీవ్రంగా సోకిన పరిస్థితిలో పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు మూత పడడం, పనులు కోల్పోవడంతో, వలస కార్మికులు తిరిగి గ్రామాలకు రావడంతో ఉపాధి పనికి డిమాండ్‌ పెరిగింది. ఉపాధి పథకానికి బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయలు పైగా కేటాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పెడ చెవిన పెడుతున్నది.

కరోనా వల్ల పని దినాలు పడిపోతున్నాయని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని కేంద్రం గుర్తించింది. కానీ దానికి తగిన నివారణ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని, ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని, అందుకు ఆదాయ పన్ను చెల్లించని వారందరికి నెలకు రూ.7500, తలకు 10 కేజీల బియ్యం చొప్పున కనీసం 6 నెలల పాటు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తుంటే...కంటి తుడుపుగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తలకు నెలకు 5 కేజీల చొప్పున 10 కేజీల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. కానీ దేశంలో బడా పెట్టబడిదారులకు కరోనా కాలంలోనే రూ. రెండున్నర లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు కట్టబెట్టాయి. కాకులను కొట్టి గద్దలకు వేసే చందంగా ప్రజల నుండి గోళ్ళూడగొట్టి పన్నులు వసూలు చేసి బడా పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ధారబోస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు ఏకతాటిపై నిలబడి పోరాడాలి.

దడాల సుబ్బారావు
/వ్యాసకర్త: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు/

ఉపాధి హామీ చట్టం అమలులో ప్రభుత్వాల వైఫల్యం