May 31,2023 01:19
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: పనులు లేని సమయంలో గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా పనులు చేసే కూలీలకు కనీస వేతనం రూ.600 వచ్చేలా చర్యలు చేపట్టాలని, ఆన్‌లైన్‌ ఫోటో విధానాన్ని ఎత్తివేసి, ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ నేతలు డిమాండ్‌ చేశారు. బాపట్ల జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో కోటి పనిదినాలు కల్పించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కాని ఆచరణలో 73 లక్షల పనిదినాలకే పరిమితం అయ్యారు. జిల్లాలో 2.56 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా ఇందులో 2 లక్షల కార్డుల వరకు మనుగడలో ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 4.56 లక్షల మంది ఉపాధి కూలీలు ఉండగా ఈ సీజన్‌లో 3.50 లక్షల మంది పనులకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఎండలు అధికంగా ఉండడం పని ప్రదేశాలు దూరంగా ఉన్న కారణంగా పనులు ముందుకు సాగక రోజు కూలి రూ.230కి మించడం లేదు. ఉదయం నుంచే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉపాధి పనులకు హజరవుతున్న వారు ఎక్కువ సమయం పని చేయలేని పరిస్థితులున్నాయి. అలానే పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. గతంలో పనికి వచ్చే కూలీల కోసం ఎండల నుంచి రక్షణ కోసం టార్పాలిన్‌ పట్టలు ఇచ్చేవారు. తాగునీటితో పాటు, మజ్జిగ ఇచ్చేవారు. పనిముట్లు ఉపయోగించే వారికి అదనంగా కూలి ఇచ్చేవారు. ప్రథమ చికిత్స కిట్లు ఇచ్చేవారు. కాని ప్రస్తుతం ఇవేవీ లేవు. తాగునీరు కూడా కూలీలే తెచ్చుకుంటున్న దుస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, మేట్లకు పారితోషకం ఇవ్వాలని, ప్రతి జాబ్‌ కార్డుకు వంద రోజులు తగ్గకుండా పని ఇవ్వాలని, వ్యవసాయ కార్మికులకు రోజుకు రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జూన్‌ 5వ తేదీ బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మోండ్రు ఆంజనేయు లు, జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్‌లు తెలిపారు.