ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి:వ్యకాస
ప్రజాశక్తి పగిడ్యాల
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరావు అన్నారు. సోమవారం మండలంలోని లక్ష్మాపురం అంచ సమీపాన ఉపాధి కూలీలతో నాగేశ్వరావు మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం గత సంవత్సరం బడ్జెట్లో ఉపాధి హామీ చట్టానికి రూ 98 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం రూ 60 వేల కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. సంవత్సరం సంవత్సరానికి ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో తగ్గిస్తూ పోతూ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని విమర్శించారు. ఇప్పటివరకు చేసిన పనులకు రూ 25 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్లో ఉపాధి హామీ పథకం చట్టానికి రూ 2.75 లక్షల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలను పొమ్మనలేక పొగ పెట్టినట్టు నాలుగు గంటలకు ఒకసారి ఫోటో యాప్ తో మానిటరింగ్ చేయాలని ఇబ్బందులను ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. యాప్ మానిటరింగ్ చేసేటప్పుడు సర్వర్లు పనిచేయక కూలీలకు బిల్లులు పడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు పని చేసే చోట వసతులు లేక నీటీ సౌకర్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వేసవికాలంలో పని ప్రదేశాలలో ఎటువంటి సౌకర్యాలు లేక ఉపాధి కూలీలు వడదెబ్బ తగిలి మృత్యువాతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఉపాధి కూలీలకు కుటుంబాలకు రూ 10లక్షల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నా నిలుచడం జరుగుతుందని ఈ ధర్నాకు ఉపాధి కూలీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా సహాయ కార్యదర్శి పకీర్ సాహెబ్, సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ , వ్యకాస నాయకులు ప్రసాద్, అశోక్, జ్యోతి, మరియమ్మ, సువార్తమ్మ, సువర్ణమ్మ, శ్రీనివాసులు, మధు తదితరులు పాల్గొన్నారు.










