మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 15 సంవత్సరాలు పూర్తయింది. వామపక్షాల ఒత్తిడి మేరకు యుపిఎ-1 ఉపాధి హామీ చట్టం తెచ్చింది. 2006 ఫిబ్రవరి 2న ఐక్య ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో నాటి ప్రధాని మన్‌మోహన్ సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించారు. దేశ చరిత్రలోనే... వ్యవసాయ కార్మిక కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల ఉపాధి హామీకి గ్యారెంటీ కల్పిస్తూ తెచ్చిన మొట్టమొదటి చట్టం ఇదే.
గడిచిన పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయ కార్మిక, పేద కుటుంబాలకు ఉపాధి పనులు కల్పిస్తూ, అనేక ఒడిదుడుకులకు గురవతూ, పాలక వర్గాలకు అయిష్టంగానే అయినా ప్రజా ఉద్యమాల ఒత్తిడి మేరకు అరకొర నిధులతో ఈ చట్టం ముందుకు సాగుతోంది. కోట్లాదిమందికి సొంతగ్రామాలలో ఉపాధి చూపించి కొద్దో గొప్పో గ్రామీణ పేదల కొనుగోలు శక్తి పెంచింది. కరోనా సమయంలో కూడా పేదలు ఆకలి చావులు సంభవించకుండా కాపాడింది. దళిత, గిరిజనులకు, మహిళలకు, ఆర్థికంగా చేయూతను ఇవ్వటమే కాకుండా వ్యవసాయ కూలీల వేతనాలు పెరగటానికి ఈ చట్టం కారణమైంది. అంతిమంగా పేదలకు బేరమాడే శక్తిని కల్పించింది.
సంక్షోభ సమయంలో భారతదేశానికి ఒక చేయూతగా ఈ పథకం ఉపయోగపడిందని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌తో పాటు అనేకమంది ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ సైతం ఈ చట్టాన్ని కొనియాడిందంటే 60 శాతం పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు గొప్ప ఊరటనిచ్చింది. ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నిధులు పెంచి, బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బలహీన పరచడానికి ప్రయత్నం చేయడం అత్యంత బాధాకరం.
ఉపాధి చట్టం వచ్చిన తొలిరోజులలో మన రాష్ట్రంలో మూడు ఫలితాలు కన్పించాయి. 1. పేదల వలసలు కొంత తగ్గాయి. 2. వ్యవసాయ కార్మికులకు రోజు కనీస వేతనం పెంచుకోవటానికి దోహదపడింది. పేదల కొనుగోలు శక్తి పెరిగింది. 3. స్త్రీ, పురుషులకు సమాన వేతనం, ఒంటరి మహిళలకు, విభిన్న ప్రతిభావంతులకు సామాజిక న్యాయం కలిగించింది. పథకం ప్రారంభంలో ఆనాటి వామపక్షాల ప్రభావంతో కేంద్ర బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిగాయి. 2009 యుపిఎ-2 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకానికి తగినన్ని నిధులు కేటాయించక పోవటం, మెటీరియల్ కాంపొనెంట్ శాతం పెంచి కూలీలకు నష్టం కలిగించి కాంట్రాక్టర్లకు, దళారీలకు లాభం చేకూర్చే పద్ధతుల్లో ఈ చట్టాన్ని సవరించారు. 2006లో ఈ చట్టం ప్రారంభం చేసినప్పుడు 90 శాతం నిధులు కూలీలు చేయగలిగే పనులకు ఖర్చు పెట్టారు. ఈ పనులలో యంత్రాలు ఉపయోగించరాదు. కాంట్రాక్టు పద్ధతి ఉండరాదు. కేవలం ఉపాధి పని చేసే కుటుంబాలకు 100 పని దినాలు ఈ చట్టం కల్పించింది. యుపిఎ-2 ప్రభుత్వం దీనిని బలహీన పరచటానికి కుట్రలు చేస్తున్నది. దేశ వ్యాపితంగా జరిగిన ప్రజా ఉద్యమాల ఫలితంగా బిజెపి ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.
2006లో దేశ వ్యాపితంగా ఆనాడు కేవలం 200 జిల్లాల్లో మాత్రమే ప్రారంభించారు. ఆ రోజు నిర్ణయించిన రోజు వేతనం రూ. 80 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయించింది రూ.40 వేల కోట్లు. నేడు ఈ పథకం జమ్ము-కాశ్మీర్ మినహా దేశ వ్యాపితంగా 715 జిల్లాల్లో 2 లక్షల 69 వేల 520 పంచాయితీలలో ఈ పథకం అమలు జరుగుతున్నది. సుమారు 16 కోట్ల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఇచ్చారు. 2006తో పోలిస్తే జిల్లాలు మూడింతలు పెరిగాయి. వేతనాలు రూ. 80 నుండి రూ. 248 లకు పెరిగింది (మూడు రెట్లు). ఈ లెక్కన కేంద్ర బడ్జెట్‌లో లక్ష 60 వేల కోట్లు కేటాయించాలి. కాని గత కరోనా సమయంలో లక్ష కోట్లు మినహా ఏ సంవత్సరమూ 70 వేల కోట్లకు మించలేదు. ఈ నిధులు కూడా సకాలంలో ఇవ్వకపోవటంతో నెలల తరబడి కూలీలు వేతనాల బకాయిలతో అనేక అవస్థలు పడ్డారు. అదేవిధంగా గతంలో 90 శాతం కూలీలతో చేయించాలన్న నిబంధనలు ఉల్లంఘించి 60 శాతానికి కుదించి మెటీరియల్ కాంపొనెంట్ 40 శాతం పెంచి కాంట్రాక్టర్లకు జేబులు నింపి పేదల కడుపు కొడుతున్నారు. దేశంలో ఆనాడు 7 కోట్ల 55 లక్షల కుటుంబాలకు పని కల్పిస్తే నేడు 5 కోట్ల 77 లక్షలకు (5.77 కోట్లు) పడిపోయింది. అంటే (1.78 కోట్లు) కుటుంబాలు ఈ ఉపాధి నుండి దూరమయ్యారు. ఉపాధి హామీ పథకం ప్రారంభం నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించింది దాదాపు 8 లక్షల కోట్లు (అంటే పంచవర్ష ప్రణాళిక కాలంలో పారిశ్రామికవేత్తలు బ్యాంక్‌లకు ఎగ్గొటినంత కూడా కాదు). ఈ పథకం పట్ల వ్యతిరేకత కలిగిన గ్రామీణ సంపన్న వర్గాలు... చట్టం రావటం వల్ల కూలీలు కొరత ఏర్పడిందని దుష్ప్రచారం చేస్తూ దీన్ని ఎత్తి వేయాలని లేదా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయానికి అనుసంధానం చేయటమంటే భూస్వాములు యంత్రాలతో తమ పొలంలో పనులు చేయించుకుని ఉపాధి నిధులను తమకు ఇవ్వాలనే డిమాండ్ తప్ప మరొకటి కాదు. 2012లో నాటి బిజెపి పార్లమెంట్ సభ్యురాలు మిహిర్షా నాయకత్వంలోని కమిటీ దేశ వ్యాపితంగా పర్యటించి ఇప్పటికే వ్యవసాయ అనుబంధంగానే 28 రకాల పనులు జరుగుతున్నాయి. కాబట్టి వ్యవసాయానికి అనుసంధానం చేయనవసరం లేదని పార్లమెంట్‌కు నివేదిక సమర్పించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికకు తిలోదకాలు ఇస్తున్నది.
ఇప్పటికే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఆహార పంటల స్థానంలో వాణిజ్య పంటలు పెరిగాయి. ఈ కారణంగా కూలీలకు పెద్దఎత్తున పనిదినాలు పడిపోయాయి. యంత్రాల ప్రవేశం, చివరకు వరినాట్లు వేయడం కాకుండా వెదజల్లే పద్ధతి రావటంతో భారీగా మహిళల పనిదినాలు తగ్గిపో యాయి. గతంలో కుటుంబానికి వ్యవసాయంలో 170 దాకా పనిదినాలు ఉంటే నేడు వ్యవసాయంలో 40-50 రోజులకు మించి పనిదినాలు దొరకటంలేదు. ఈ కారణంగా ప్రతియేటా లక్షలాది మంది వలసలు పోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో ఉపాధి హామీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ అమలులో ఆంధ్ర రాష్ట్రానికి అనేక పథకాలు వచ్చాయని ప్రచారం చేసుకుంటున్నారు. గడిచిన దశాబ్దరన్నర కాలం పరిశీలిస్తే, పథకం ప్రారంభంలో ప్రతి కుటుంబానికి సగటున 66 పని దినాలు కల్పిస్తే, నేడు 47 పని దినాలకు పడిపోయాయి. నాడు 100 రోజులు చేసిన కుటుంబాలు 22 శాతం ఉంటే నేడు 12 శాతానికి తగ్గిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం పరిశీలిస్తే రూ. 5 వేల 953 కోట్లు వేతనాలకు ఖర్చు చేస్తే మెటీరియల్‌కు రూ. 3 వేల 597 కోట్లు ఖర్చు పెట్టారు. కూలీలకు ఖర్చు పెట్టామనే డబ్బులో కూడా ప్రభుత్వ భవనాలకు, సిమెంట్ రోడ్లకు, చివరకు నీరు-చెట్టు కోసం సుమారు రూ. 1400 కోట్లు ఖర్చు చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపారు.
ఈ 15 సంవత్సరాలలో నిర్లక్ష్యానికి గురవుతూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ చట్టం ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఒకనాడు గ్రామీణ పేదల కోసమే ఈ చట్టం వచ్చినప్పటకి నేడు పట్టణీకరణ పెరిగి పేదలకు ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. కాబట్టి ఈ చట్టం పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏ మూలకు చాలడం లేదు. పెరుగుతున్న డిమాండ్, కనీస వేతనాలు దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతుంది. రూ.32 లక్షల కోట్లతో బడ్జెట్ ఉన్న ఈ దేశానికి రూ.2 లక్షల కోట్లు పెద్ద భారం కాదు. నేడు కేంద్రంలో పచ్చి మితవాద, మతవాద, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వుండటం వల్ల ఇలాంటి చట్టాలు వివక్షకు గురవుతున్నాయి. కనుక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని అదే స్ఫూర్తితో అమలు జరిగేలా పోరాడాదాం. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలి. పథకాన్ని (చట్టాన్ని) పట్టణ ప్రాంతాలకు విస్తరింపచేయాలి. కుటుంబానికి 200 రోజులు పనులు రూ. 600 వేతనం ఇవ్వాలి.
/ వ్యాసకర్త - ఏ.పి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి /
వి. వెంకటేశ్వర్లు











