Apr 07,2023 00:02

మాట్లాడుతున్న ఎంపిడిఒ డేవిడ్‌రాజు

ప్రజాశక్తి-గొలుగొండ:ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు పనుల్లో పాల్గొనాలని ఎంపిడిఒ డేవిడ్‌రాజు సూచించారు. గురువారం ఆయన మండలంలో రావణాపల్లి గ్రామంలో ఉపాధి పనులను, జగనన్న కాలనీ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ, ఉపాధి కూలీలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాన్ని పొందేందుకు రెండు పూటలా పనులకు హాజరు కావాలన్నారు. జాబ్‌కార్డు కలిగి ఉండి పనుల్లోనికి రాని వారిని తప్పనిసరిగా పనుల్లోనికి తీసుకువచ్చే విధంగా విఆర్పిలు సమాయత్తం చేయాలన్నారు. కూలీల మస్తర్లను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలోని ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. చెల్లింపుల విషయంలో ఎటువంటి సమస్యలు తెలిపిన తన దృష్టికి తీసుకు రావాలని ఆయన లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ గోపి, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.