ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రజాస్వామిక వాదులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉపా లాంటి క్రూరమైన చట్టాలను మోపి ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధించటం దుర్మార్గమని, వారిపై పెట్టిన ఉపా కేసులను తక్షణం ఎత్తివేయాలని విప్లవ రచయితల సంఘం సీనియర్ నాయకులు సిఎస్‌ఆర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈనెల 15వ తేదీ విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపా రద్దు పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమ కరపత్రాలను, పోస్టర్లను స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద బుధవారం ఆవిష్కరించారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ దేశ ఖనిజ సంపదను, సహజ వాహనరులను ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న పాలకులు తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కుల నిర్మూలన పోరాట సమితి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, పౌరహక్కుల సంఘం, చైతన్య మహిళా సంఘం, ప్రజా కళామండలి, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం, అమరుల బంధుమిత్రుల సంఘం, విరసం తదితర ప్రజాసంఘాల నాయకులపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తప్పుడు ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహించారు. తక్షణం కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.పోతురాజు, గనిరాజు, ఎన్.నీలాంబరం, బి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.










