Aug 14,2021 06:20

    ట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) దేశానికి కళంకం. నాగరికత ఉన్న ఏ దేశంలోనైనా, ప్రభుత్వం ఒక వ్యక్తిని విచారణ లేకుండా, బెయిల్‌ ఇవ్వకుండా ఏళ్ల తరబడి నిర్బంధించే చట్టం....చివరికి విచారణలో ఆ వ్యక్తి అమాయకుడని తేలితే, అతడు కోల్పోయిన అన్ని సంవత్సరాల జీవితానికి ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారాన్ని చెల్లించకుండా అనుమతించే చట్టం...ఏదైనా ఉందా అంటే అది 'ఉపా' చట్టం మాత్రమే.
     ఆఖరికి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం కూడా ఆ విధమైన అధికారాలను పొందే డిమాండ్‌ చేయలేదు. వాస్తవానికి, అప్పుడు అప్రదిష్ట పాలైన దేశద్రోహ చట్టం ఉంది. అయితే, ఆ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణ కోసం సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచకుండా వేగంగా విచారణ చేపట్టేవారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు అనేక సార్లు జైళ్ళకు వెళ్ళి, అనేక సంవత్సరాల పాటు శిక్ష అనుభవించేవారు. కానీ వెళ్ళిన ప్రతీ సందర్భంలో జైలులో మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లేరు. 1920 తొలి రోజుల్లో గాంధీజీ సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉన్న కాలాన్ని గమనిస్తే, ఆయన మార్చి 10, 1922లో అరెస్ట్‌ అయితే, కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కానీ, జనవరి 12, 1924లో, అంటే ఇరవై రెండు నెలల తరువాత విడుదల అయ్యారు. క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో ఆయన ఇంతకన్నా తక్కువ కాలమే జైలులో గడిపారు. అదే క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ సుదీర్ఘకాలం పాటు అంటే 1041 రోజులు అహ్మద్‌ నగర్‌ కోటలో నిర్బంధంలో ఉన్నారు. కానీ బీమా కోరెగావ్‌ కేసులో 'ఉపా' చట్టం కింద నిర్బంధంలో ఉన్నవారు ఇప్పటికే మూడు సంవత్సరాలకు పైగా జైలులో ఉంటున్నారు. మరో నెల రోజుల్లో అనేక మంది మూడు సంవత్సరాల జైలు జీవితానికి చేరుకుంటారు. వారిపై మోపబడిన ఆరోపణలు ఏమిటనేవి ఇంతవరకు ఫైల్‌ చేయలేదు. కోర్టులు వారికి బెయిల్‌ మంజూరు చేయకుండా తిరస్కరిస్తున్నాయి. అయితే, వారికి వ్యతిరేకంగా ఉపయోగించిన సాక్ష్యాలను అరెస్ట్‌ చేయడానికి ముందే వారి కంప్యూటర్ల లోకి చొప్పించారని...ప్రపంచ ప్రసిద్ధ సంస్థ 'ఆర్సినల్‌' పేర్కొంది.
     వాస్తవానికి, వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న విప్లవకారులు జైళ్ళలో చాలా కాలం గడిపారు. ప్రముఖ విప్లవకారుడు గణేష్‌ ఘోష్‌ చిట్టగాంగ్‌ ఆయుధాగారంపై దాడిలో పాల్గొన్నందుకు 14 సంవత్సరాల పాటు అండమాన్‌ జైల్లో శిక్ష అనుభవించాడు (విడుదల అయిన తరువాత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు). అయితే కేసు విషయమై అరెస్టయి విచారణ ముగియడానికి మధ్య రెండు సంవత్సరాల పాటు మాత్రమే నిర్బంధంలో ఉన్నాడు. సంవత్సరాల తరబడి, విచారణ చేయకుండా ప్రజలను నిర్బంధించడం అనేది బ్రిటిష్‌ వలస పాలనలో కూడా అసాధారణ విషయమే.
       ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇటీవలి కాలంలో వ్యక్తి స్వేచ్ఛ యొక్క స్వచ్ఛతను చాలావరకు అంగీకరించిన విషయం పక్కన పెట్టి... యుద్ధానికి ముందు జర్మనీని ఓసారి పరిశీలిద్దాం. 1933లో జర్మన్‌ పార్లమెంట్‌ భవనం, రీచ్‌ స్టాగ్‌పై దాడి చేసి తగులబెట్టినప్పుడు...ఆ చర్యలకు పూనుకున్నారని భావించబడిన కమ్యూనిస్టులను అణచివేసేందుకు, పార్లమెంట్‌ అనుమతించిన సందర్భంలో కూడా... నేరారోపణలు చేయబడినవారు ఏడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో లేరు. విచారణ తరువాత నేరారోపణలు చేయబడిన నలుగురిలో ముగ్గురిని విడుదల చేశారు. ఆ నాల్గవ వ్యక్తి జార్జి డిమిట్రోవ్‌ (తరువాత కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌కు అధ్యక్షుడు అయ్యాడు) తన తరపున తానే వాదించుకున్న సందర్భంలో... అప్పటి మంత్రి హెర్మన్‌ గోరింగ్‌ ను కోర్టు బోనులో నిలబెట్టి ప్రశ్నించేందుకు అనుమతించారు (ఒకసారి బీమా కోరెగావ్‌ కేసు నిందితుల్లో ఒకరికి నేటి భారతదేశ హోం మంత్రి అమిత్‌ షా ను ప్రశ్నించేందుకు అనుమతించినట్లు ఊహించండి). హిట్లర్‌ ఛాన్సలర్‌ గా ఎన్నికైనపుడు ఉన్న జర్మనీ పరిస్థితి అది. తరువాత మారిందనుకోండి. కానీ అప్పుడు హిట్లర్‌ ప్రజాస్వామికంగా ఉన్నట్లు నటించలేదు. ఆయన దృష్టి అంతా ఫాసిస్టు రాజ్య స్థాపన పైనే వుంది.
      'ఉపా' చట్టంతో ఉన్న సమస్య ఏమిటంటే, అది ప్రజాస్వామ్యంలో అంగీకరించిన న్యాయ శాస్త్రం యొక్క ప్రాథమిక సూత్రాలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. చాలా క్రిమినల్‌ కేసుల్లో... నేరారోపణలు చేయబడిన వ్యక్తులు.. సాక్షులపై ఒత్తిడి చేయడం, సాక్ష్యాలలో జోక్యం చేసుకోవడం వంటి ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశాలకు అడ్డంకిగా లేనిపక్షంలో... సాధారణంగా బెయిల్‌ మంజూరు చేస్తారు. కానీ 'ఉపా' చట్టం కింద నిర్బంధంలో ఉన్న వ్యక్తి నిర్దోషి అని విశ్వసించడానికి తగిన ప్రాతిపదిక ఉంటేనే బెయిల్‌ మంజూరు చేస్తారు. అంటే దీనర్థం, విచారణకు ముందు కూడా, కోర్టు ఆ వ్యక్తి నిర్దోషిత్వం పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విచారణ ముగిసేసరికి దోషిగా నిర్థారణ కాకపోతే, నిందితుడిని నిర్దోషిగా భావించాలనే ప్రాథమిక సూత్రానికిది విరుద్ధంగా ఉంటుంది.
      అదేవిధంగా, అరెస్టులు, బెయిల్‌ మంజూరుకు సంబంధించిన అంశాలను పక్కన పెడదాం. జూలై 2019లో సవరించబడిన 'ఉపా' చట్టం ఇంతకు ముందు తరహాలో కేవలం ఒక సంస్థను మాత్రమే కాక, వ్యక్తిని కూడా తీవ్రవాదిగా ప్రకటించడానికి, ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తిని (ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం లేకుండా) కూడా జప్తు చేయడానికి 'నేషనల్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ'కి ప్రభుత్వం అనుమతిస్తుంది. ఒకవేళ తీవ్రవాదిగా ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి ఎటువంటి కళంకం లేకుండా బయటపడాలంటే, తాను నిర్దోషినని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి పైనే ఉంటుంది. అతడ్ని తీవ్రవాది అని ప్రకటించిన ప్రభుత్వానికి, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత లేదు. అది ఆ వ్యక్తి బాధ్యత. ఇక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ లోని న్యాయశాస్త్రం యొక్క ప్రాథమిక నియమాలు పూర్తిగా తలకిందులు చేయబడుతున్నాయి.
దానితోపాటుగా 'ఉపా' చట్టం కింద చేర్చిన ''తీవ్రవాదం'' అనే పదానికి నిర్వచనం కేవలం తీవ్రవాద చర్యలు మాత్రమే కాదు. యథాతథ స్థితి నుంచి సామాజిక మార్పు కోసం ప్రచారం చేయడం కూడా తీవ్రవాదంగా పరిగణించ బడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత ప్రజాతంత్ర విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు అవసరమైన అన్ని భిన్నాభిప్రాయాలను, విమర్శనాత్మక ఆలోచనలకు వ్యతిరేకంగా 'ఉపా' చట్టాన్ని ఉపయోగించవచ్చు. వేల సంవత్సరాలుగా వ్యవస్థీకృతమైన అణచివేత, అసమానతల వారసత్వం గుర్తించిన ఈ యథాతథ స్థితిని అంగీకరించాలని ఈ చట్టం సమాజాన్ని ఒత్తిడి చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడే వారెవరైనా విచారణ, బెయిల్‌ లేకుండా కొన్ని సంవత్సరాల పాటు జైలు నిర్బంధంలో ఉంటారు.
     'ఉపా' చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉంచడం చట్టం తప్పు కాదనీ, కోర్టుల్లో కేసులు పేరుకుపోవడం వలన జరుగుతోందని కొందరు వాదించవచ్చు. కానీ ఈ వాదనలో ప్రామాణికత లోపించింది. ఎందుకంటే, మొదట ఏ చట్టమైనా ఆచరణాత్మక పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలి. రెండవది అధికార సంస్థలు, విచారణకు వచ్చే 'ఉపా' కేసులను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు, బీమా కోరెగావ్‌ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌ వాస్తవానికి మరాఠీలో ఉంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మందికి మరాఠీ భాష తెలియకపోవడం వల్ల చార్జిషీట్‌ను అనువదించడానికి చాలా సమయం పట్టింది. అనువాదం చేయబడిన చార్జిషీట్‌ వేల సంఖ్యలో పేజీలు ఉండడంతో, చార్జిషీట్‌లు ఉన్న పెన్‌ డ్రైవ్‌లు అందజేశారు. కానీ, జైలులో వారికి కంప్యూటర్‌ అందుబాటులో లేదు. దాంతో విచారణ జరుపుతున్న జడ్జి చార్జిషీట్‌ నకలు ప్రతులను తీయించి ఇవ్వమని అడిగితే పోలీసులు అందుకవసరమైన నిధులు లేవన్నారు. ఈ విషయమై జడ్జి పట్టుపట్టడంతో, చార్జిషీట్‌ నకలు కాపీలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సమకాలీన భారతదేశంలో ఆరోపణలు చేయబడిన అనేకమంది సున్నిత మనస్కులు, ఆలోచనాపరులు తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్నారు. 'ఉపా చట్టం' దేశానికి ఒక కళంకం. దీనిని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది.
 

/ 'ది టెలిగ్రాఫ్‌' సౌజన్యంతో /

ప్రభాత్ పట్నాయక్

ప్రభాత్ పట్నాయక్