Nov 16,2023 20:29

ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఇఒఆర్‌డి సూర్యనారాయణ

ప్రజాశక్తి- దేవనకొండ
దేవనకొండ మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం పంచాయతీ కార్యాలయంలో ఇఒఆర్‌డి సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు అబ్దుల్‌ రహీం, రిబిక ఆధ్వర్యంలో ఎన్నిక చేపట్టారు. మొత్తం 14 వార్డు సభ్యులకు గాను 8 మంది వార్డు సభ్యులు రజియాబీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచి ఎన్నిక సమయంలో రెండున్నర ఏళ్లు ఎర్రగోటి నరసన్న, మరో రెండున్నర ఏళ్లు రజియాబీకి ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నారు. మొదట పదవి చేపట్టిన ఉప సర్పంచి రెండున్నర ఏళ్లు పూర్తి కావడంతో ఒప్పందం ప్రకారం ఉప సర్పంచి పదవి మరొకరికి ఇవ్వాల్సి ఉండగా వార్డు సభ్యులు తమకే కావాలని పోటీ పడ్డారు. వైసిపి మద్దతు వార్డు సభ్యులు ఉప సర్పంచి పదవి దక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన టిడిపి మద్దతు మెజార్టీ వార్డు సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక ఒప్పందానికి వచ్చి 8 మంది వార్డు సభ్యులు పింజరి రజియాబీని ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారులు ఏకగ్రీవంగా ఉప సర్పంచి పదవి ధ్రువీకరణ పత్రాలు రజియాబీకి అందజేశారు. సర్పంచి రంగ లక్ష్మి, టిడిపి నాయకులు బడి గింజల రంగన్న, ఉచ్చీరప్ప, రామారావు నాయుడు, మాలిక్‌, ఆకుల వీరేష్‌, రాజా సాబ్‌, మాల బండ్లయ్య, సుభాన్‌, మస్తాన్‌, రాముడు పాల్గొని రజియాబీకి పూలమాల వేసి సన్మానించారు.