* నాలుగు సర్పంచ్ స్థానాల్లో మూడింటిలో గెలుపు
* వార్డు స్థానాల్లో టిడిపి గట్టి పోటీ
* పదికి నాలుగు చోట్ల ఆ పార్టీ మద్దతుదారుల విజయం
* 78.33 శాతం పోలింగ్ నమోదు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, యంత్రాంగం: పంచాయతీ ఉప ఎన్నికల పోరులో వైసిపి ఆధిక్యం కనబరిచింది. అధిక స్థానాల్లో ఆ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. జిల్లాలోని నాలుగు సర్పంచ్, పది వార్డు సభ్యుల స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. నాలుగు సర్పంచ్ స్థానాలకు గానూ వైసిపి మద్దతుదారులు మూడు చోట్ల విజయం సాధించగా, ఒకచోట టిడిపి మద్దతుదారు గెలిచారు. వార్డు సభ్యుల స్థానాల దగ్గరకొచ్చేసరికి టిడిపి గట్టి పోటీనిచ్చింది. పది వార్డు సభ్యులకు గానూ ఆరు చోట్ల వైసిపి, నాలుగు స్థానాల్లో టిడిపి మద్దతుదారులు విజయం సాధించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసిపి అధిక స్థానాల్లో గెలిచినా, ఆ పార్టీకి సంతోషం లేకుండా పోయింది. గతంలో ఆ పార్టీ మద్దతుదారుడు గెలిచిన స్థానం ఇప్పుడు టిడిపి పరమైంది. సరుబుజ్జిలి మండలం బొప్పడాం పంచాయతీలో 2021 ఎన్నికల్లో వైసిపి మద్దతుతో పోటీ చేసిన పి.విజయలక్ష్మి ఆరు ఓట్లతో గెలుపొందారు. ఆమె మరణించడంతో నిర్వహించిన ఎన్నికల్లో టిడిపి మద్దతుదారునిగా పోటీ చేసిన పి.వెంకటనరసమ్మ 127 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు పది వార్డు స్థానాలకు టిడిపి నాలుగు స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. ఆమదాలవలస నియోజకవర్గంలో రెండు వార్డులను స్వల్ప ఓట్లతో ఆ పార్టీ మద్దతుదారులు ఓటమిపాలయ్యారు. ఆమదాలవలస మండలం కొరపాం వార్డును మూడు ఓట్లు, సరుబుజ్జిలి మండలం తెలికిపెంట వార్డును ఐదు ఓట్లతో కోల్పోయింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం గ్రామస్థాయి నాయకులు కొంతవరకు బాగానే పోరాడినా జిల్లా నాయకత్వం ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పార్టీ నుంచి ఏ మాత్రం సహకారం అందినా తమ ఖాతాలో మరిన్ని స్థానాలు పడేవని నాయకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఐదు సర్పంచ్ స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా అది వైసిపి ఖాతాలో పడింది. నామినేషన్లు వేసి ఎన్నికలు జరిగిన 76 స్థానాల్లో 66 వార్డుల్లో 61 వైసిపి మద్దతుదారులే ఏకగ్రీవంగా గెలిచారు. ఫలితాల దగ్గరకొచ్చేసరికి ఆ స్థాయిలో గెలవలకపోయిందని టిడిపి నాయకులు ఉదహరిస్తున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికల ఉప సమరం టిడిపి శ్రేణుల్లో కొంత జోష్‌ను నింపింది.
78.33 శాతం పోలింగ్
జిల్లాలోని నాలుగు సర్పంచ్, పది వార్డు స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో 78.33 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 5,020 మంది ఓటర్లు ఉండగా 3,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2,346 మంది పురుషులకు గానూ 1880 మంది (80.14 శాతం) ఓటు వేశారు. 2,674 మంది మహిళలు ఓటు వేయాల్సి ఉండగా 2,052 మంది (76.74 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సర్పంచ్ స్థానాలకు సంబంధించి సరుబుజ్జిలి మండలం బొప్పడాంలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ మొత్తం 717 మంది ఓటర్లు ఉండగా 635 మంది (88.56 శాతం) తమ ఓటును వినియోగించుకున్నారు. సారవకోట మండలం బద్రిలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది.
సర్పంచ్‌ల వివరాలు
మండలం పంచాయతీ గెలిచిన అభ్యర్థి మెజార్టీ మద్దతుదారు
సరుబుజ్జిలి బొప్పడాం పి.వెంకటనరసమ్మ 127 టిడిపి
నందిగాం అన్నాపురం ఇంద్రవేణి 89 వైసిపి
బూర్జ పెద్ద లంకాం కె.గోవిందరావు 80 వైసిపి
సారవకోట బద్రి బి.అసిరమ్మ 29 వైసిపి
వార్డు సభ్యుల వివరాలు
మండలం పంచాయతీ గెలిచిన అభ్యర్థి మద్దతుదారు
టెక్కలి నర్సింగపల్లి ఎం.పావని వైసిపి
సరుబుజ్జిలి తెలికిపెంట వి.అప్పలనరసమ్మ వైసిపి
పోలాకి కొత్తరేవు ఎ.ఉమ వైసిపి
గాతలవలస పి.శాంతారావు టిడిపి
ఆమదాలవలస కొరపాం ఎం.లక్ష్మి వైసిపి
జలుమూరు జోణంకి బి.సూరమ్మ టిడిపి
ఎచ్చెర్ల డి.మత్య్సలేశం కె.కృష్ణారావు టిడిపి
నరసన్నపేట కోమర్తి ఎల్.రాజారావు వైసిపి
మాకివలస పి.సింహాచలం టిడిపి
వజ్రపుకొత్తూరు యు.జిపురం కె.కృష్ణారావు వైసిపి
బూర్జ : పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
నందిగాం : ఎన్నికల కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
సరుబుజ్జిలి : వెంకట నరసమ్మకు ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి
సరుబుజ్జిలి : విజయ సంకేతం చూపిస్తున్న వెంకట నరసమ్మ










