Oct 30,2023 22:37

సమస్యల గురించి ఉప కలెక్టర్‌కు తెలుపుతున్న నాయకులు


ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌
మార్కాపురం డివిజన్‌ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుమ్మ బాలనాగయ్య మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లో ప్రధానంగా రైతులు వర్షంపై ఆధారపడి వ్యవసాయని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి లేనందున వ్య వసాయ బోర్లకు నీరు సక్రమంగా రాకపోవడంతో వేసిన వంటలు ఎండిపోయి రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వెయ్యి అడుగుల మేర బోర్లు వేసిన నీరు పడలేని పరిస్థితి ఎదురైందని వాపోయారు. రైతు సోదరులు లక్షల్లో పెట బదులు పట్టి సరైన వర్షాభావ పరిస్థితులు లేనందున వంటలు చేతికి రాక తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలో అర్థం కాక అర్థంతరంగా తన వులు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి మార్కాపురం సబ్‌ డివిజన్‌ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా రైతు సోదరులు సాగు చేసి పెద్ద ఎత్తున నష్టపోయిన మిర్చి పంటకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.1లక్ష ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్‌ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని, మూగజీవాలకు గడ్డి నీరు అందించాలని, ఈ సంవత్సరం తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేయాలని, కౌలు రైతులకు సైతం నష్టపరిహారం ఇవ్వవలసినదిగా వారు డిమాండ్‌ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఉప కలెక్టర్‌ సేదు మాధవన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డికెఎం రఫీ, ఎరువా పాపిరెడ్డి, వై యేసు టీవీ.సుబ్బయ్య, ఎన్‌ గంగురాజు, జి. వెంకటేశ్వర్లు, ఎన్‌. చిన్న వెంకటరామయ్య, డివి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.