Nov 19,2021 06:18

రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్‌ సహా 12 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు, 11 జడ్‌పిటిసి, 123 ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసిపి ఘన విజయాలు సాధించింది. నెల్లూరు కార్పొరేషన్‌ లోని మొత్తం డివిజన్లను తన ఖాతాలో వేసుకోవడంతోపాటు ప్రతిష్టాత్మక పోరు జరిగిన కుప్పం మున్సిపాల్టీలోనూ అత్యధిక వార్డులను వైసిపి గెల్చుకొంది. అదే సమయంలో ప్రకాశం జిల్లా దర్శిలో అత్యధిక వార్డులు టిడిపి వశం కాగా కృష్ణా జిల్లా కొండపల్లిలో వైసిపి, టిడిపి చెరి 14 వార్డులను గెల్చుకోగా ఒక ఇండిపెండెంట్‌ (టిడిపి రెబల్‌) విజయం సాధించారు. ఐదు వార్డులను, ఐదు ఎంపిటిసి స్థానాలను జనసేన గెల్చుకుంది. సిపిఎం రెండు, సిపిఐ ఒక ఎంపిటిసి స్థానాల్లో గెలుపొందాయి. వైసిపి ఎనిమిది జడ్‌పిటిసి, 80 ఎంపిటిసి, టిడిపి మూడు జడ్‌పిటిసి, 33 ఎంపిటిసి స్థానాల్లో గెలిచాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అత్యధిక స్థానాలు, ఓట్లు తెచ్చుకుంది. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం జరిగిందని, పోలీసు యంత్రాంగం, సచివాలయ సిబ్బంది కొన్ని చోట్ల అధికార పార్టీ కొమ్ము కాయడమేగాక ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హైకోర్టు సైతం జోక్యం చేసుకోవలసి వచ్చింది. అయితే, అప్పటి ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో టిడిపి ఓటింగ్‌ శాతం పెరగడం గమనార్హం.
ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పాలకపక్షం మురిసిపోవచ్చు. కొన్ని వార్డులు, డివిజన్లకే ఉప ఎన్నిక జరిగిన చోట అధికార పార్టీ ఘన విజయాలు సాధించినా మొత్తం మునిసిపాల్టీలకు జరిగిన చోట కొన్ని ఎదురుదెబ్బలు తగిలిన విషయం విస్మరించరాదు. దర్శిలో టిడిపి గెలుపొందగా కొండపల్లిలోనూ ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థితో కలిపిజూస్తే ఆధిక్యత వారిదే! కుప్పంలో గెలుపు వైసిపికి ప్రతిష్టాత్మకమేగాక టిడిపి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడానికీ దోహదపడవచ్చు. అయినా ఆ ఒక్క దాంతోనే అంతా అయిపోదు కదా! అనేకమంది అధికార పార్టీ ప్రముఖ నేతల స్వగ్రామాలు, సొంత వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం ఒక హెచ్చరిక వంటిది. గతంతో పోల్చితే అధికార పార్టీ అభ్యర్థుల మెజార్టీలు తగ్గిపోవడం కూడా అలాంటిదే. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుతో అధికార పార్టీపై ప్రజల్లో ప్రతికూలత పెరిగింది. రెండున్నరేళ్ల కాలంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా కొన్ని తరగతుల వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. ఇంకొంతమందికి అందుతున్న సంక్షేమ ఫలాలకు తనిఖీల పేరిట కత్తెర వేసింది. దాంతో అర్హులు చాలామంది సంక్షేమానికి దూరమయ్యారు. పెద్ద ఎత్తున సంక్షేమాన్ని గురించి ప్రచారం గావించినా అర్హులందరికీ అవి అందుబాటుకు రావడం లేదు. ఇలాంటి అసంతృప్తులన్నీ అధికార పార్టీకి ప్రతికూలంగా పని చేయడం సహజం.
ప్రధాన ప్రతిపక్షం కుప్పంలో ఓడిపోయనా దర్శిలో గెలవడం, కొండపల్లిలో 'నువ్వా...నేనా...' అనడమేగాక ఇంకొన్ని చోట్ల గణనీయమైన స్థానాలనే తన ఖాతా లోకి వేసుకోవడం ఊరటగా వారు భావించవచ్చు. అయితే, అధికార పార్టీ ఒత్తిళ్లు, ప్రలోభాలకు తోడు నాయకులు, కార్యకర్తల ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమూ ఈ ఓటముల వెనుక ఒక ముఖ్య కారణం కావచ్చు. దర్శిలో నాయకులందరూ ఐక్యంగా పని చేయడం, వార్డు, బూత్‌ స్థాయి వరకూ కార్యకర్తలు పట్టుదలగా పని చేయడం విజయానికి దారి తీసిందని కథనాలచ్చాయి. అందుకు భిన్నంగా కుప్పంలో కింది స్థాయి వరకూ టిడిపి యంత్రాంగం లేకపోవడమో లేక నిర్వీర్యం కావడమో జరిగిందని అంటున్నారు. కాబట్టి పార్టీ నిర్మాణం, కార్యకర్తల ప్రాధాన్యత మరోసారి ముందుకొచ్చినట్టయింది.
ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండడానికి బలమైన ప్రతిపక్షం ఎంతో అవసరం. ఆ రీత్యా ఈ ఫలితాలు కొంతవరకు ఆశాజనకమే అనుకోవచ్చు. స్థానిక సంస్థల్లో ప్రధానంగా విధానపరమైన అంశాలకన్నా ఎక్కడికక్కడ ప్రజలెదుర్కునే ఇబ్బందుల గురించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఏకోన్ముఖంగా కృషి చేయాలి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజలపై భారాలు మోపే విధానాలను ఇకనైనా విడనాడడం అవసరం. అదే ఈ ఉప ఎన్నికల ద్వారా ప్రజలిచ్చిన సందేశం.