Oct 11,2023 13:26
  •  పట్టించుకోని ఆర్టీసీ అధికారులు  

ప్రజాశక్తి - ఎర్రగుంట్ల : పట్టణ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అనుచందంగా అధికారులు వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనధికారికంగా దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టనట్లు మౌనం వహిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార దుకాణాల కారణంగా బస్సులు ఎక్కుటకు దిగుటకు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండు మాసాల క్రితమే ఇబ్బందులకు గురవుతున్నామని స్వయంగా ప్రయాణికులే ప్రొద్దుటూరు డిపో మేనేజర్ కు ఫిర్యాదు ఇచ్చిన ఇప్పటివరకు ఎటువంటి తొలగింపు చర్యలు చేపట్టకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆగస్టు నెలలో ఆర్టీసీ డిఎం మల్లికార్జున రెడ్డి ఎర్రగుంట్ల బస్టాండ్ ఆవరణను పరిశీలించి అనధికారికంగా ఏర్పాటు చేసిన రెండు దుకాణాలను తొలగించాలని యజమానులకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు తొలగించకపోవడంతో అధికారులపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దుకాణ యజమానులకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, ఆ ఒత్తిళ్లు కారణంగానే అనధికార దుకాణాలైనా కూడా తొలగించే చర్యలు చేపట్టడం లేదని వాదన ప్రజల్లో బలంగా వినపడుతోంది. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనధికార దుకాణాలను తొలగించే చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.ఆర్టీసీ డిఎం ను వివరణ కోరగా నాలుగు రోజుల్లో తొలగించే చర్యలు చేపడతామని,ఇప్పటికే యజమానులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.