Sep 05,2023 23:29

సత్కారం పొందిన ఉపాధ్యాయులతో కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. తొలుత డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యేలా, గుర్తుండేలా బోధించాలని, ప్రశ్నించే తత్వాన్ని, తెలుసుకోవాలనే తపనను కలిగించాలని అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పథం, సృజనాత్మకతను పెంపొందించాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు అంకితభావంతో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులంతా ఉత్తమ ఉపాధ్యాయులేనని అన్నారు. ప్రత్యక్ష భోధనకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ఉపాద్యాయులు గౌరవమైన పాత్ర పోషిస్తున్నారని, తల్లితండ్రుల తరువాత స్థానం గురువుదేనని అన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ హెన్రి క్రిష్టీన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఒడిదుడుకులను తమ తల్లితండ్రుల ద్వారా ప్రత్యక్షంగా చూశానని, ప్రతి ఉపాద్యాయునికి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆడర్శప్రాయమని అన్నారు. అనంతరం ఎంపిక చేసిన 54 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. తొలుత మున్సిపల్‌ బాలిక పాఠశాల విద్యార్థులు ప్రార్థనా గీతం ఆలపించారు. ఆక్స్‌ఫర్డ్‌, శంకరభారతిపురం పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.శామ్యూల్‌, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, ముదిరాజ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ స్వామి, షేక్‌ కార్పొరేషన మెంబర్‌ జానిబాషా, జెడ్‌పిటిసి హరీష్‌, ఎంపిపి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.