
ప్రజాశక్తి - భీమవరం
గిరిజన సామాజిక వర్గాలు ఉన్నతంగా ఎదగాలంటే చదువుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీలో ఒకరిగా ఉన్న పెండ్ర వీరన్న నుండి స్ఫూర్తి పొందాలన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్ స్థాయి నుంచి తిరిగి కష్టపడి చదువుకోవడం, వారి నైపుణ్యం, భావ వ్యక్తీకరణతో పదవిని అలంకరించారని తెలిపారు. కష్టపడి చదివితే ఉన్నతంగా రాణించవచ్చన్నారు. ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సంచార జాతుల కార్పొరేషన్ ఛైర్మన్ పెండ్ర వీరన్న మాట్లాడుతూ విద్య ద్వారానే గిరిజన సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గిరిజన ఆదివాసీల ఆరోగ్య పరిస్థితులపై కూడా ప్రతినెలా సమీక్షించాలన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి డి.పుష్పరాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, జిల్లా అధికారులు, గిరిజన సంక్షేమశాఖ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.