Jul 06,2023 01:05

సచివాయం ఎదుట ధర్నా చేస్తున్న పేదలు, సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇప్పటిదాకా ఒకే ఊరిలో కలిసి బతుకుతున్నామని, ఇదే ఊరిలో ఉన్నచోటనే ఇళ్లస్థలాలకు పట్టాలిచ్చి తమ జీవనోపాధికి తోడ్పడాలని పేదలు కోరారు. ఈ మేరకు పట్టణంలోని అమరారెడ్డినగర్‌, యానాదులకాలనీ, కొత్తకాలనీ వాసులు బుధవారం 4, 5 వార్డుల సచివాలయం అధికారులకు అర్జీలు అందజేశారు. సిపిఎం ఆధ్వర్యంలో తొలుత సచివాలయాల ముందు కొత్తూరు పిడబ్ల్యుడి కట్ట మీద ఇళ్లను తొలగించవద్దని, నివాసం ఉంటున్న ఇళ్లను రెగ్యులరైజేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ పేదలు ధర్నా చేశారు. అనంతరం దఫాలు దఫాలుగా సచివాలయాల వద్దకు వచ్చి మధ్యాహ్నం 12.30 వరకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు. రెండు రోజులు ఈ ప్రాంతంలో సిపిఎం సర్వే నిర్వహించింది. అధిక శాతం మంది తాము ఉంటున్న ఇళ్లకే పట్టాలివ్వాలని సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు అర్జీలు పూర్తి చేసి అధికారులకు అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాజధానిలో పేదలకు సెంటు స్థలం కేటాయించి, ఇక్కడ నుంచి ఖాళీ చేయమనడం న్యాయం కాదన్నారు. పేదల అవసరాలను, వారిని జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఉంటున్న పేదలకు అక్కడే స్థలాలను రెగ్యుటరైజేషన్‌ చేసి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. 40 సంవత్సరాల నుంచి సుమారు 500 కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న స్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలని కోరారు. సెంటు స్థలం ఇవ్వడంతో ఇక్కడ ఇళ్లు తొలగిస్తారనే ఆందోళన పేదల్లో నెలకొందన్నారు. గత ఎన్నికలకు ముందు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. అనంతరం సిఎంకు కూడా వ్యక్తిగత అర్జీలు అధికారుల ద్వారా అందజేశారు. కార్యక్రమాల్లో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, నాయకులు కె.కరుణాకరరావు, డి.విజయభాస్కరరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, ఎస్‌.ముత్యాలరావు, వై.బర్నబస్‌, కె.మేరి, డి.యోహాన్‌, ఆచారి, దావీద్‌ పాల్గొన్నారు.