Sep 19,2023 23:44

సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న పేదలు, నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి : తాము నివసిస్తున్న చోటనే ఇంటికి పట్టా ఇవ్వాలని పేదలు ఐక్యమయ్యారు. సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని కృష్ణుని గుడి వద్ద గల ఐదో సచివాలయం, తాడేపల్లి మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం వద్దకు పెద్దఎత్తున తరలివచ్చి ధర్నా చేశారు. తాము నివాసం ఉంటున్న నివాసాలను రెగ్యులరైజేషన్‌ చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే పేదల ఆందోళనపై సచివాలయ అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కనీసం అర్జీలు తీసుకోవడానికీ నిరాకరించారు. సచివాలయం వద్ద అర్జీలు స్వీకరించకపోవడంతో అక్కడ నుంచి మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయం వరకు పేదలు ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ కాదు అక్కడ.. అక్కడ కాదు ఇక్కడ ఇవ్వండని అధికారులు చెప్పడంతో పేదల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మున్సిపల్‌ జోనల్‌ కార్యాలయాన్ని ముట్టడించినంత పని చేశారు. ఎట్టకేలకు ఎంటిఎంసి రెవెన్యూ అధికారి మురళీ పేదల వద్దకు వచ్చి సచివాలయ అడ్మిన్‌ను పిలిపించి అర్జీలు స్వీకరించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో పేదలు శాంతించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డి.విజయభాస్కరరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, జి.సుబ్బారెడ్డి, ఎస్‌.ముత్యాలరావు మాట్లాడారు. ఉన్న చోటనే పేదలకు పట్టాలిచ్చి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. రాజధానిలో ఇళ్లస్థలాల పేరిట ప్రభుత్వర కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, ప్రస్తుతం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడుంటున్న స్థలాలు పేదలు పని చేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్నాయని, కుటుంబాలు సజావుగా సాగుతున్నాయని, ఇప్పుడున్న స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లబోరనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. ఏ ప్రభుత్వ స్థలంలోనైనా 13 ఏళ్లు నివాసం ఉంటే దానిపై పూర్తి హక్కులు ఆ పేదలకు చెందుతాయని చట్టం చెబుతుందని గుర్తు చేశారు. ఇటీవల నీరుపారుదల శాఖ అధికారులు ఇచ్చిన నోటీసులు వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వానికి పేదలు ఉంటున్న స్థలాలు అవసరమైతే మరోచోట ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి ఇళ్లు కట్టించిన తరువాతనే ప్రస్తుతం ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలని, అప్పటి వరకు పేదల ఇళ్ల జోలికొస్తే సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వై.బర్నబస్‌, పి.గిరిజ, కె.బాబూరావు, దశరథరామిరెడ్డి, యోహాన్‌, యలమందాచారి, ఎన్‌.దుర్గారావు పాల్గొన్నారు.