ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : జిల్లాలో ప్రతిపక్షం ఉనికి కోసం పాకులాడుతుండగా.... ఆ చర్యలకు అధికార పక్షం ఉలికిపాటుకు గురౌతోంది. తాజా పరిణామాలను ఇందుకు భేరీజు వేస్తున్నారు జనం. భవిష్యత్తు గ్యారెంటీ పేరిట టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బస్సు యాత్ర నియోజకవర్గాలవారీగా సాగుతున్న విషయం విధితమే. ఈనెల 4వ తేదీన జిల్లాకు చేరిన బస్సులో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయ కర్త బుద్దా వెంకటన్న నాయకత్వంలో విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన నాయకులు యాత్రచేపట్టిన విషయం విధితమే. ముఖ్యంగా విజయనగరంలో చేపట్టిన బస్సుయాత్ర ముమ్మాటికీ ఉనికి కోసమేనని పబ్లిక్ టాక్. బస్సుయాత్రలో సందర్శించిన స్థలాలు, సమస్యలతోపాటు భవిష్యత్తు గ్యారెంటీ అన్న అంశంపైనా జనం విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. టిడిపి ప్రతిపక్షంలోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. వైసిపి చెప్పిన మద్యపాన నిషేధం అమలు చేయలేదు సరికదా.. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. వీటిపై అడపాదడపా ప్రెస్‌మిట్లలోనో లేక ఆడియో క్లిప్పింగుల్లోనూ తప్ప గట్టిపోరాటం చేసిన దాఖలాలు లేవు. కానీ, కెఎల్‌పురంలో వున్న సర్కారువారి మద్యం దుకాణాన్ని ఊరు అవతలకు మార్చడాన్ని తప్పుపడుతూ హడావుడి చేయడం పట్ల చాలా మంది నవ్వుతున్నారు. మరీ ముఖ్యంగా సోనియానగర్, సారిపల్లిలో టిడ్కో ఇళ్ల నిర్మాణం తమ హయాంలోనే 80శాతం పూర్తిచేశామని టిడిపి నాయకులు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు తామే నిర్మాణ పనులు పూర్తిచేశామని కూడా చెప్పారు. ఆ మాటకొస్తే లబ్ధిదారులకు కేటాయింపులు కూడా చేశారు. ఆ తరువాత ఇళ్లు అప్పగించకపోవడంతో గడిచిన ఎన్నికల్లో లబ్ధిదారులు టిడిపిని ఇంటికి పంపారు. విజయనగరంలో టిడిపి ఓటమికి ఇది కూడా ఒక కారణమని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు ప్రజలకు అప్పజెప్పేందుకు ముందుకు రాని టిడిపి, రానున్న ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తుందని పలువురి విమర్శ. గురజాడ అప్పారావు స్వగృహాన్ని సాహితీ కేంద్రంగా అభివృద్ధిచేయాలని చాలా కాలంగా కవులు, రచయితలు, సాహితీ ప్రియులు, పట్టణ పుర ప్రముఖులు కోరుతున్న విషయం విధితమే. అధికారంలో ఉన్నన్నాళ్లూ పెడచెవిన పెట్టి తాజాగా బస్సుయాత్రలో గురజాడపై భక్తిని ప్రదర్శించారు. ఇక పెద్దచెరువుతోపాటు విజయనగరం కోట అభివృద్ధికి టిడిపి హయాంలో రూ.కోట్లు మంజూరయ్యాయి. దుర్వినియోగమైనట్టు విమర్శలు కూడా వినిపించాయి. వాటి అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ కీలకమైన అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో టిడిపి విఫలమైంది. అధికారంలోకి వచ్చాకైనా వాటికోసం ప్రభుత్వాన్ని నిలదీయలేదు. దీంతో, ప్రస్తుతం చేపడుతున్న భరోసా గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సు రథయాత్ర కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే గడిచిన నాలుగేళ్లలో ఎందుకు ప్రశ్నించడం లేదని పలువురువ వాదిస్తున్నారు.
ఇక వైసిపి పరిస్థితికి వస్తే టిడిపి చేపట్టిన బస్సుయాత్రకు ఉలికిపాటుకు గురికావడం తప్ప, వారు అడుగుతున్న ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోతోంది. ముఖ్యంగా టిడ్కో ఇళ్లు ఇవిగో అవుగో అంటూనే నాలుగేళ్లు గడిపేశారు. ఈ నేపథ్యంలో టిడిపికి, వైసిపికి తేడా ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు. లబ్ధిదారులకు నాడు చంద్రబాబు ఇచ్చిన పత్రాలను రద్దుచేసి, వాటి స్థానంలో జగన్మోహన్‌రెడ్డి బొమ్మతో కూడిన పత్రాలు ఇవ్వడం తప్ప ఇళ్లు అప్పగించిన పాపాన పోలేదన్న ఆవేదన వ్యక్తమౌతోంది. టిడిపిపై స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల ఎదురుదాడి చేసే బదులు పెద్దచెరువును, అక్కడ తలపెట్టిన ట్రీట్‌మెంట్ ప్లాంటును ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారో చెబితే బాగుంటుందని చాలా మంది చర్చించుకుంటున్నారు. టిడిపి నాయకులు చేసిన ఆరోపణలకు తగ్గట్టే జెఎన్‌టియు కొండపై అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సోలార్ పవర్ ప్లాంట్‌ను గాలికి వదిలేసింది. నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రజాధనం నిరుపయోగం కావడంతోపాటు విద్యుత్ అవసరాలను తీర్చుకోలేని దుస్థితి ఏర్పడింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పట్టించుకోలేదు. వీటిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పడానికి బదులు ఉనికి కోసమే ఇదంతా చేస్తున్నారని బుకాయించడం ప్రజలు గమనిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కేవలం ఉనికి చాటుకోవడానికి, ఉలికిపడి కాకుండా ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందిస్తే ప్రజలు గుర్తిస్తారని పలువురు హితవు పలుకుతున్నారు.










