న్యూయార్క్ : పూర్తి స్థాయి పౌరయుద్ధం పెచ్చరిల్లే ముప్పు ముంగిట సూడాన్ వుందని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటానియో గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు మూడు మాసాలుగా సూడాన్‌లో ఘర్షణలు కొనసాగుతునే వున్నాయి. రాజధాని ఖార్టూమ్‌లో ఆదివారం కూడా ప్రత్యర్ధి సైనిక జనరల్స్ మధ్య ఘర్షణలు భీకరంగా కొనసాగాయి. సూడాన్ మిలటరీ, శక్తివంతమైన పేరా మిలటరీ బలగాల మధ్య జరుగుతున్న పోరాటంతో దేశం మొత్తంగా అస్థిరమయ్యే ప్రమాదం వుందని శనివారం సాయంత్రం ఆయన హెచ్చరించారని గుటెరస్ డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. ఏప్రిల్ మధ్యలో ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణలు అనతికాలంలోనే బహిరంగా పోరాటంగా మారిపోయాయి. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 3వేల మందికి పైగా మరణించారని, 6వేల మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య మంత్రి హైతమ్ ఇబ్రహీమ్ తెలిపారు. కానీ అనధికారికంగా మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే వుండే అవకాశం వుంది. సూడాన్‌లోనే 29లక్షల మందికి పైగా ప్రజలు తమ ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వీరిలో కొంతమంది పొరుగు దేశాలకు కూడా తరలిపోయారు. 2021 అక్టోబరులో సైనిక కుట్రలో అక్కడి పౌర ప్రభుత్వం కూలిపోయింది.ఆ తర్వాత 18మాసాలకు ఈ ఘర్షణలు చోటు చేసుఉన్నాయి. దీంతో శాంతియుతంగా ప్రజాస్వామ్య క్రమానికి బదిలీ కాగలమన్న ప్రజల ఆశలు చెల్లాచెదుర్యాయి. ఈ ఘర్షణలతో రాజధాని ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాలు కదనరంగాలుగా మారిపోయాయి.










