తాడేపల్లి: ఉండవల్లి ఎత్తిపోతల పథకం కింద రెండో పంటకు ఆశలు వదులు కోవాల్సిందే అని రైతులు ఆందోళన చెందు తున్నారు. ప్రతి ఏటా జూన్ మొదటి వారంలో ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందేది. జులై వచ్చినా నీరు అందకపోవడంతో రెండో పంట వేసుకునే అవకాశం ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. మొదటి పంట వరి వేస్తే పెట్టుబడులు వస్తాయి తప్ప రూపాయి మిగలదని రైతులు అంటున్నారు. రెండో పంట కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల మీద తమకు నాలుగు రూపాయలు మిగులుతాయని రైతాంగం చెబు తుంది. జులై చివరికి వచ్చినా తాగునీరు అందకపోవ డంతో రెండో పంటకు అవకాశం ఉండదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్‌ను గురు వారం రైతు సంఘం జిల్లా కార్యదర్శి జొన్నా శివశంకర రావు, నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కరణలు వచ్చిన తరువాత నీటి సంఘాల పేరుతో ప్రభుత్వం ఉండవల్లి ఎత్తిపోతల పథకం నుంచి తప్పుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. ఇంతవరకు పంట పొలాలకు నీరు అందకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. లిఫ్టుకు సంబంధించి కాలువలు పెద్దఎత్తున మొలిచిన గడ్డిని తొలగించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి లిఫ్టు నుంచి రైతులకు నీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకరరావు, రాజధాని రైతు సంఘం అధ్యక్షులు కె.ఈశ్వరరెడ్డి, పి.వీరాస్వామి, టి.బక్కిరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










