ఉండ్రాలయ్యా.. వీడ్కోలయ్యా..!
తిరుపతిలో వెయ్యికి పైగా విగ్రహాలు
చవితి వేడుకల వ్యయం రూ.3 కోట్లు పైనే
ఏడు రోజుల పాటు 'నిమజ్జన' వేడుకలు
ప్రజాశక్తి-తిరుపతి సిటి
వినాయక చవితి. పడమట ప్రాంతాల్లో దీన్ని పిలారిపండగ, తూర్పు ప్రాంతంలో గణేశ జయంతి ఉత్సవాల పేరుతో నిర్వహిస్తుంటారు. వినాయక చవితి అందర్ని కలిపే పండగ. యువత పెద్ద సంఖ్యలో కేరింతల మద్య జరుపుకునేది. ఈ ఏడాది వినాయకచవితికి కేవలం ఒక తిరుపతి నగరంలోనే 3కోట్ల రూపాయలకు పైగా విగ్రహాలను ఏర్పాటు చేసి, నిమజ్ఞనం చేయడం గమనార్హం.
బోలో గణేష మహారాజ్‌కు జై...గణపతి బొప్పా బోరియా... నినాదాలతో తిరుపతి ప్రాంతం గత ఏడు రోజులుగా పులకించి పోయింది. అందులోని సత్యప్రమాణాలకు నెలవైన వరసిద్ది వినాయకుడు కొలువైన కాణిపాకం గల ఉమ్మడి జిల్లా కావడం. తూర్పున దక్షణ కైలాసంగా పేరుగడించిన శ్రీకాళహస్తి, దక్షణాన శ్రీపద్మావతి అమ్మవారి క్షేత్రం, ఉత్తరాన కలియుగ శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల ప్రాంతం సరిహద్దులగా గల తిరుపతి నగరం ఆద్యాత్మిక క్షేత్రంగా ఎదుగుతోంది. నగరంలో భక్తికి కొదవుండదు. దీంతో పండుగల్లో తొలిదైన వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ధనిక, పేద, మద్యతరగతి తేడా లేకుండా జరుపుకుంటారు. ఈ ఏడాది నగరంలోని ప్రదాన కూడల్లో సుమారు 1050 విగ్రహాలు నెలకొల్పినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో ప్రాంతంలో 8 అడుగల నుంచి 20 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు ఏర్పాటు చేశారు. 8 అడుగల ఎత్తుగల విగ్రహం మార్కెట్‌లో 16వేల రూపాయలు ధర పలికింది. దీనికి అదనంగా చిన్న చిన్న సందుల్లో 5 నుంచి 6 అడుగుల ఎత్తుగల విగ్రహాలు మరో 500 వరకు ఏర్పాటు చేశారు. వీటి ధర 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు ఉంది. తిరుపతి, తిరుపతి రూరల్‌లో కలిసి సుమారు లక్షకుపైగా కుటుంబాలు చిన్న చితకా విగ్రహాలను ఇళ్లల్లో నెలకొల్పి వినాయక చవితిని నిర్వహించారు. ఈ విగ్రహాలన్ని పూజానంతరం అదే రోజు సాయంత్రం, మూడోవ రోజు, ఐదోవ రోజు, ఏడోవ రోజు, 9వ రోజు సమీపంలోని నీటి గుంటల్లో నిమజ్ఞనం చేశారు. కేవలం ఒక తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన బారీ విగ్రహాలు, చిన్నాచితక, ఇళ్లలోని చిన్న విగ్రహాల విలువ సుమారు 3కోట్ల రూపాయలకు పైచీలకు ఉంటుందని నిపుణులు అంచనా. వీటన్నిటిని తిరుపతిలోని వినాయకసాగర్, బొమ్మలక్వార్టర్స్ ఎదురుగా ఉన్న చెరువు, వెంకటాపురం చెరువు, తిరుపతి పరిసరాల్లోని చెరువులు, నీటి గుంటల్లో నిమజ్ఞనం చేశారు. విగ్రహాల వద్ద అన్నదానం, ప్రతి రోజు ప్రసాదాల పంపిణీ, లడ్డులు ఏర్పాటు, ఉట్లోత్సవం, అరిటిమాన్లు, చెరుకులు, ఎలక్కాయలు, మారేడు, 21 రకాల పత్రులు, కొబ్బరి కాయలకు, కర్పూరం, ఆగరబత్తిలు, స్వీట్లు, కుడుములు, పాయసం, ఇతరాత్ర పూజ సామాగ్రిలకు కలిపి మరో 5 కోట్లకు పైగా వ్యయం అయుంటుందని అంచనా. ఇదంతా కూడా ప్రతి ఇంటి నుంచి చందా రూపంలో వసూళ్లుచేసిన సొమ్మే. పండగల్లో ప్రతి ఒకర్ని బాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఈ కోవలో సొమ్మును వసూళ్లు చేసి నగరం మొత్తం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏడు రోజుల పాటు యువత ఉత్సాహంగా పండగను జరుపుకోవడం గమనార్హం.
వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న యువత










