Nov 22,2020 12:20

ఉండనీ... నన్నిలాగే వుండనీ....
ఒక తుషార స్వప్నంలో తడిచిపోయిన జ్ఞాపకంగా
మనోహర రాగాన్ని మీటుతున్న హృదయ వీణలా
దిగంతాల నుండి కోసుకొచ్చిన ఆనంద పుష్పంలా...
వుండనీ.. నన్నిలాగే వుండనీ
కనిపించీ కనిపించని నీ పాద ముద్రల్ని
వినిపించీ వినిపించని నీ గుండె సవ్వడుల్ని
నీ మనో రంజిత సుగంధ సువాసనల్ని
అనుక్షణం ఆస్వాదిస్తూ.. నన్నిలా వుండనీ..
వెన్నెల చల్లని మైదానాల్లో
నీ పాద ముద్రల్ని వింటూ
పారుతున్న సెలయేళ్ళల్లో
నీ గుండె సవ్వడులను స్పర్శిస్తూ ...
విరబూసిన ఇంద్రధనస్సులో
నీ కాంతి కళ్ళను కంటూ...
వుండనీ ..
నన్నిలాగే వుండనీ..
ఒక్క లిప్తపాటులోనైనా
నిన్ను బంధించానన్న పొగరు..
జీవిత కాలమంతా... 'నీ' భావాన్ని
అణువణువునా ప్రతి దర్శనంలో నాలో ఇముడ్చుకుంటున్నానన్నా
గర్వం నాకిలాగే వుండనీ.
 

- కళ్యాణదుర్గం స్వర్ణలత
98486 26114