Aug 17,2023 18:41

ప్రజాశక్తి - ఉండి
ఉండి మెయిన్‌ సెంటర్లో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. గణపవరం, ఆకివీడు, భీమవరం రహదారులకు మధ్య కూడలిగా ఉన్న ఈ సెంటర్‌ గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇరుకుగా ఉన్న పెద్ద వంతెన మీద భారీ వాహనాలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి. ఉండి పెద్ద వంతెన వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఇది వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోలీసు సిబ్బంది ఉండేవారు. నేడు వాహన రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కరువయ్యారు. రెండు నెలల క్రితం 108 అంబులెన్స్‌ సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో అంబులెన్స్‌లోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్ద వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించి ట్రాఫిక్‌ సమస్యను తీర్చేందుకు టిడిపి అధికారంలో ఉండగా మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు పలుమార్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అయితే కార్యరూపం దాల్చక పోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అనంతరం ప్రభుత్వం మారడం, ఉండి నియోజకవర్గాన్ని తిరిగి టిడిపి కైవసం చేసుకోవడం, రాష్ట్రంలో వైసిపి అధికారం చేపట్టడంతో పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించాలనే ప్రణాళిక మరుగున పడిపోయింది. దీంతో ఉండిలో ట్రాఫిక్‌ కష్టాలు తీరేనా అని ఎదురు చూడటం ప్రజలవంతైంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మించి ఉండి మెయిన్‌ సెంటర్లో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చాలని ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.