
ప్రజాశక్తి - ఉండి
ఉండి రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రయాణికుల సంఘం, శశి ఇంగ్లీషు మీడియం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి చిట్టి అడవిలా మారిపోయింది. కొన్ని పిచ్చి మొక్కలు పెద్ద పెద్ద చెట్ల మాదిరిగా మారాయి. దీంతో స్టేషన్ ఆవరణలో ప్రయాణికులు రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించిన శశి ఇంగ్లీషు మీడియం స్కూల్ యాజమాన్యం, రైల్వే ప్రయాణికుల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వాటిని తొలగించారు. వీటితోపాటు ప్రాంగణంలో ప్రయాణికులకు, వాహనాలకు అడ్డుగా ఉన్న కొమ్మలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షులు కొమ్మన నాగబాబు, శశి ఇంగ్లీషు మీడియం స్కూల్ డైరెక్టర్ ఖండాపు శ్రీనివాసరావు, ప్రయాణికుల సంఘం కార్యదర్శి సిహెచ్.బంగారురావు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా స్వచ్ఛభారత్‌తో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో శశి స్కూల్ కూడా భాగస్వాములు కావడం పట్ల ప్రయాణికుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉండి రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కుమార్ మాట్లా డుతూ ప్రజలు భాగస్వాములైనప్పుడు ప్రభుత్వ సంస్థలు మరింత సమర్థవంతంగా సేవలందిస్తాయని పేర్కొన్నారు.