Oct 30,2023 21:56

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదిరి నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలపై టిడిపి జనసేన అధ్వర్యంలో కలిసికట్టుగా ఉమ్మడి పోరాటాలు కొనసాగిస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌, జనసేన పార్టీ ఇన్‌ఛార్జి బైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు.ఈ మేరకు సోమవారం కందికుంట నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయన్నారు. అందులో భాగంగా రాష్ట్ర, జిల్లా నాయకుల అధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణ సిద్దం చేశారని ఆదివారం ఇరుపార్టీల అధ్వర్యంలో ఉమ్మడి సమావేశం అనంతపురంలో జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో కదిరి పట్టణంలో మంగళవారం టిడిపి జనసేన ఉమ్మడి సమావేశం తాయి గ్రాండ్‌ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్‌, కాయల చలపతి, నాయకులు రాజశేఖర్‌ బాబు, రవి, అంజి తదితరులు పాల్గొన్నారు.