ఉమ్మడి పౌర స్మృతి సమానత్వానికి చేటు
మహిళా సమస్యలపై ప్రత్యేక కమిషన్ వేయాలి
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఉమ్మడి పౌర స్మృతి పేరిట పురుషాధిపత్యాన్ని మహిళలపై రుద్దడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఉమ్మడి పౌర స్మృతి సమానత్వానికి చేటుగా మారబోతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని ఎన్ జి ఓకాలనీలోని టి. నరసింహయ్య భవన్ లో జరిగిన ఐద్వా నంద్యాల జిల్లా కమిటీ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి ముఖ్యతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు టి. నిర్మల అధ్యక్షత వహించారు ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో పురుషాదిక్యతను పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తుందన్నారు. మహిళలకు సమాన హక్కులు లేకుండా చేసే కుట్ర బిజెపి ప్రభుత్వం చేస్తుందన్నారు.కుటుంబ వ్యవస్థలో కూడా మహిళ కు రెండవ స్థానం లో ఉంచటం వలన సమాజంలో మహిళకు రెండవ స్థానంలోనే ఉంటుంది. స్త్రీల శ్రమను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా స్త్రీలు సమాజంలో కుటుంబాల్లో స్వతంత్ర్యం లేక హింస కు గురవుతున్నారు.నూటికి 90 శాతం మహిళలు వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆడపిల్లలను ఎత్తుకుపోయి సెక్స్ వ్యాపారం లో దించితున్నారని వీటన్నిటిని పరిష్కరించుటకు మన ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు.మహిళలపై జరుగుతున్న హింస, అత్యాచారాలు, వేధింపులు అరికట్టాలని, మహిళల సమాన హక్కుల వైపు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిస్కారం కోసం ఈ నెల 28 నుండి ఆగస్టు 8 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా జాతాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.మహిళా జాత సందర్బంగా ఆగస్టు 5 న నంద్యాల లో సభ జరుగుతుందన్నారు. అలాగే ఆగస్టు 8 న విజయవాడ లో జరిగే బహిరంగ సభలో సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ పాల్గొంటారని రమాదేవి తెలిపారు.కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు పెరిగి పోతున్నాయని, స్వాతంత్ర్యం,రాజ్యాంగం స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు కల్పించాయన్నారు.ఆ సమాన హక్కులు ఆచరణలో లేనందున మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి వారికీ చదువు, ఉద్యోగాలలోను, రాజకీయాలలో వారి పాత్ర కోసం గత ప్రభుత్వాలు రిజర్వేషన్ లు అమలు చేస్తూ వచ్చాయన్నారు. ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో దేశంలో చర్చ ను తీసుకువచ్చి హిందూ అగ్రవర్ణ అధిపత్యాన్ని అందరిపైన రుద్దాలని చూస్తుందని, పురుషాధిపత్యాన్ని నిలబెట్టడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆమె విమర్శించారు. అసమానతలు ఉన్నందువలననే పురుషులు స్త్రీల పైన అత్యాచారాలు చేయడం హింసించడం వంటి ఆకృత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. మగవారు ఏమైనా చేయవచ్చు అని పద్ధతిలో ప్రభుత్వాలు మద్యం మత్తుమందు కు పెద్ద ఎత్తున అలవాటు చేయడం ద్వారా హింస పెరిగిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాన హక్కుల సాధన కోసం సమాన చట్టాల సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పనిచేస్తుందన్నారు. మహిళలందరినీ కూడబెట్టి యూనిఫాం సివిల్ కోర్టు లాంటి వాటిని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సివిల్ కోడ్ చట్టాలపై మహిళల్లో విస్తృతంగా ప్రచారం చేసే వాళ్ళ అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు. మహిళా జాతర సందర్భంగా మహిళల అసమానతలు ఏ ఏ అంశాలలో ఏ రూపంలో ఉన్నాయో మహిళలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆగస్టు 17న ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో మహిళా వ్యతిరేకి మోడీ మహిళా వ్యతిరేకి బిజెపి మహిళలకు ఏరకంగా హానికరంగా ఉందో వివరించబోతున్నట్లు ఆమె తెలిపారు.










