ఉమ్మడి పౌర స్మృతి ఆమోదయోగ్యం కాదు
- రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి - నంద్యాల
పలు మతాలు, సంస్కృతి ఆచారాలతో కలిసి మెలిసి జీవిస్తున్న దేశ ప్రజలకు ఉమ్మడి పౌర స్మృతి ఆమోదయోగ్యం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం స్థానిక డిబాల మసీద్‌లో లౌకిక ప్రజాస్వామ్య వేదిక కన్వీనర్ ముహమ్మద్ అబులైస్, జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్‌ల అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని వైసిపి, టిడిపి ఎంపీలు ఓటు వేయాలన్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు సిఎం జగన్ మోహన్ రెడ్డికి, ప్రతి పక్ష నాయకులు నారా చంద్ర బాబు దృష్టికి ఈ చట్టం అమలును ప్రజలు నిరసిస్తున్నట్లు తెలపాలన్నారు. ఆయా పార్టీల ఎంపీలకు వ్యతిరేక ఓటుకు ఆదేశించాలని, ఈ చట్టం వల్ల జరిగే నష్టాలు వివరించే అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి కేంద్రం ఏకపక్షంగా అమలుకు సిద్ధమైన ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని వ్యతిరేకించాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మస్తాన్ వలి ప్రవేశం పెట్టిన తీర్మానాలను రౌండ్ టేబుల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో ఎస్‌డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అతావుల్లా ఖాన్, టిడిపి నంద్యాల పార్లమెంటరీ కార్యదర్శి ఎన్‌ఎండి ఫిరోజ్, జమైతుల్ ఉలేమా రాష్ట్ర కన్వీనర్ మౌలానా ఖలీల్ అహ్మద్, తబ్లిక్ జమాత్ అమీర్ ముఫ్తీ మౌలానా రఫీ, కాంగ్రెస్ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్, వైసిపి కోఆప్శన్ మెంబర్ సయ్యద్ సలాముల్లా, టిడిపి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మహబూబ్ వలి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, కౌన్సిలర్ యూసుఫ్, మాజీ కౌన్సిలర్ మనియార్ ఖలీల్, ఎంఏ గౌస్, పర్వేజ్, ప్రభుత్వ ఖాజీ సమ్దాని, మౌలానా అబ్దుల్లా, మౌలానా రహంతుల్లా, హాఫీజ్ ఇసాక్, హాఫీజ్ అబ్దుల్ హాది, ఆవాజ్ అధ్యక్షులు బాబుల్లా, ఆవాజ్ యూత్ సద్దాం, అక్రం, ఐయుఎంఎల్, వెల్ఫేర్ పార్టీ, అడ్వకేట్లు, ఆల్ మేవా నాయకులు తదితరులు పాల్గొన్నారు.










