పెనుకొండ : హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పరిశీలన, ఆగిపోయిన పనులు, రైతులకు నష్టపరిహారం చెల్లించని విషయాలను తెలుసుకునేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన చేయనున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు బికె.పార్థసారధి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, రాష్ట్ర నాయకులు మూడు రోజుల పాటు హంద్రీనీవా ప్రాజెక్టులను సందర్శిస్తారని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు రోజుల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ఈ నెల 6వ తేదీన పుట్టపర్తి, ధర్మవరానికి సంబంధించిన జిల్లేడుబండ ప్రాజెక్టు సందర్శన, 7న మడకశిర నియోజకవర్గం, 8న రాప్తాడు నియోజకవర్గం పేరూరు హంద్రీనీవా ప్రాజెక్టును నాయకులు పరిశీలన చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొని వారి పరిధిలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను వివరించాలని అయన కోరారు.










