
ప్రజాశక్తి-తాడేపల్లి : ఈ ఏడాది ఉల్లి పంట వేసిన రైతుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. పైరుకు మెలికల తిరుగుడు తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ తెగులు వస్తే ఉల్లి కాయ కట్టదు. భూమి పైభాగం ఉండే ఉల్లి చివర్లు మెలికలు తిరిగి ఎండినట్లు పంట పాడైపోతుంది. భూమి లోపల పాయ ఎదగనీయకుండా తినేస్తుంది. ఈ ప్రాంతంలో సహజంగా ఉల్లి ఎంతో మక్కువగా రైతులు పండిస్తున్నా ఈ ఏడాది ఉల్లి మీద ఆశలు ఆవిరవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
నిన్న మొన్నటి దాకా రూ.20 కిలో అమ్మిన ఉల్లి ఆదివారం ఒక్కసారిగా రూ.65కు చేరుకుంది. పంట చేతి కొచ్చే సమయానికి ఈ రేటు ఉంటుందా? ఉండదా? అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి రూ.లక్షల పెట్టుబడి పెట్టారు. తీరా పెట్టిన ఖర్చులయినా వస్తాయా? రావా? అనే సందిగ్ధతలో రైతులున్నారు. ఈ ప్రాంతానికి రాజధాని రాక ముందు ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో ఉల్లి పంట వేసేవారు. రాజధానిగా ప్రకటించిన తరువాత భూముల రేట్లన్నీ కోట్ల రూపాయలకు చేరుకు న్నాయి. 90 శాతం మంది రైతులు తమ భూముల పూలిం గ్‌లో ఇవ్వడంతో వ్యవసాయానికి ఆ భూములు దూరమ య్యాయి. ప్రస్తుతం 250 ఎకరాల్లోపు మాత్రమే ఉల్లి పంట వేశారు. చెన్నై దగ్గర తిరుపూర్ నుంచి ఉల్లి 'పాయ' తెచ్చి ఇక్కడ నాటే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఎకరానికి ఆరు బస్తాలు పాయ పండుతుందని, విత్తనం కోసమే రూ.27 వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
వాతావరణంలో మార్పుల వల్లే
ఎస్‌కె పీరూసాహెబ్, కౌలు రైతు.
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే పెనుమాకలో భూమి నెర్రలిచ్చింది. 30 అడుగుల్లో నీరు సమృద్ధిగా ఉండి సారవంతమైన భూములు కూడా వేసవిలో మాదిరి నెర్రలిచ్చి నోళ్లు తెరిచాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి తామెప్పుడూ చూడలేదు. దీనిపై శాస్త్రవేత్తలు పరిశీలించి కారణాలను నిర్థారించాలి. లేకుంటే తాము తరచూ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.