
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఉల్లి పాయల ధరలు భారీగా పెరిగి కిలో రూ.70కు చేరింది. రైతు బజార్లలో రూ.60 ఉండగా మార్కెట్‌లో మాత్రం రూ.70పైన విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు టామాట ధర కిలో రూ.20 నుంచి రూ.180 వరకు పెరిగినట్టు ప్రస్తుతం ఉల్లిపాయలు ధరలు గత 15 రోజులుగా పెరుగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.70కు చేరాయి. ఈ ధర ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఆశించినంత దిగుబడి రాకపోవడం, రాష్ట్రంలో విస్తీర్ణం తగ్గడం వల్ల కొరత ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సరుకు కూడా నాణ్యతగా లేదు. కిలో ఉల్లిపాయలు కొంటే అందులో అరకిలోకు పైగా నల్లటి బూజుపట్టిన పాయలు ఉంటున్నాయి. గతేడాది నుంచి నిల్వ ఉన్న పాయలు బూజుపట్టినట్టుగా వ్యాపారులు తెలిపారు. రైతు బజార్లలలో ఎక్కువగా బూజుపట్టినవి వస్తున్నాయి. వీటిని ఏరుకోవాడానికి వినియోగదారులు ప్రయత్నిస్తుండగా కొంత మంది వ్యాపారులు ఏరడం కుదరదని చెబుతున్నారు.
టమోటా ధర మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం రైతు బజార్లలో 28 నుంచి రూ.30 వరకు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.40 పలుకుతోంది. నెల రోజులుగా వర్షాభావం వల్ల టమాట ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గుతోంది. పంటలు ఎదుగుదల దశలో ఉన్న కూరగాయాల తోటలకు వర్షాభావం వెంటాడుతోంది. దీంతో రానున్న కాలంలో ఉత్పత్తులు తగ్గి మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. రైతు బజార్లలో ప్రభుత్వం ప్రస్తుతం బెండకాయలు, దొండకాయలు, క్యాబేజి, పొట్లకాయలు ధరలు తగ్గాయి. పచ్చిమిర్చి ధర రూ.50 వరకు పలికింది.
మరోవైపు బియ్యం, జిల్లాలో పప్పు దినుసులు ధరల పెరుగుదల కొనసాగుతోంది. సాదారణ బియ్యం ధరలు కిలో రూ.50 తగ్గడం లేదు. ఆరు నెలల నెలల క్రితం రూ.40 పలికిన బియ్యం క్రమంగా రూ.60 వరకు పెరిగింది. కందిపప్పు కిలో రూ.170 నుంచి రూ.180కు చేరింది. ఆరు నెలల క్రితం రూ.100 అమ్మిన కందిపప్పు ఏకంగా రూ.180 వరకు పెరిగింది. మినపగుళ్లు రూ.100 నుంచి రూ.130కి పెరిగాయి. వేరుశనగ గుళ్లు రూ.130 నుంచిరూ.150 పలుకుతుండగా పచ్చి పప్పు మాత్రం రూ.80కి చేరింది. పుట్నాల పప్పు రూ.90 నుంచి రూ.110కు పెరిగింది.
కందిపప్పు విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు. దేశీయంగా కందిపప్పు నిల్వలు లేకపోవడం వల్ల బర్మా, సౌత్ ఆఫ్రికా దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నారని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం రేషన్ కార్డులపై కందిపప్పు సరిగా సరఫరా చేయకపోవడంతో ధరలు అందుబాటులోకి రావడంలేదు. ఇతర నిత్యావసర వస్తువులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గోధుమ పిండి, గోధుమ, బొంబాయి రవ్వల ధరలూ పెరిగాయి.