Nov 01,2023 23:04

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి ఉల్లిపాయల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రిటైల్‌ మార్కెట్లో నాణ్యత ఆధారంగా కేజీ రూ.80 చేరాయి. రైతు బజార్లలో ఉల్లిపాయలు నో స్టాక్‌ బోర్డు దర్శనమిస్తోంది. దసరా, దీపావళి పండుగలతోపాటు కార్తీక మాసం రాకతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా పండుతున్న మహారాష్ట్ర, నాసిక్‌లలో ప్రస్తుతం దిగుబడులు రావటానికి మరో రెండు నెలలు పడుతుంది. జిల్లాలో 10 రైతుబజార్లు ఉన్నాయి. శాటిలైట్‌ సిటీ, అనపర్తిలోని రైతు బజార్లు నిర్మాణాలు పూర్తయినా అందుబాటులోకి తీసుకు రాలేదు. దీంతో 8 మాత్రమే కొనుగోలు దారులకు సేవలందిస్తున్నాయి. జిల్లాలో రోజుకు 5 టన్నుల ఉల్లి విక్రయిస్తారు. బహిరంగ మార్కెట్లో మరో 50 టన్నుల వరకూ విక్రయాలు జరుగుతుంటాయని అంచనా. తాడేపల్లి గూడెం హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి రోజుకు ఐదు లారీలతో ఉల్లి వస్తుంది. ఒక్కో లారీలో 35 టన్నుల సరకు ఉంటుంది. ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌ బడా వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి.
నాసిక్‌, మహారాష్ట్ర ఉల్లిపాయలకు డిమాండ్‌
నాసిక్‌, మహారాష్ట్ర ఉల్లిపాయలకు దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉల్లిని ఎక్కువగా పండిస్తారు. అయినప్పటికీ నాణ్యమైన ఉల్లపాయల కోసం ఇతర రాష్ట్రాల నుంచే ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అక్కడి పంట డిసెంబరు మొదటి వారానికి మార్కెట్‌కు రానుందని చెబుతున్నారు. ప్రస్తుతం నెలకున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ హోల్‌సేల్‌ మార్కెట్‌లో వ్యాపారులు రోజూ ధరలు నిర్ణయించే అధికారులను లోబరుచుకుని వారికి అనుకూలమైన రేట్లు ప్రకటిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ హోల్‌సేల్‌ మార్కెట్‌పై జిల్లా అధికారులు దృష్టి సారించకపోతే...ఈ దోపిడీ ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది.
రెెండు నెలలు కొరతే...?
వ్యాపారుల అంచనాల ప్రకారం మరో రెండు నెలల పాటు ఉల్లి కొరత ఘననీయంగా పెరగనుంది. 3 నెలల క్రితం కిలో టమోటా రూ.200 చేరిన విషయం విధితమే. టమోటాకు ఉల్లి కూడా ఏ మాత్రం తీసికట్టు కాదని చెబుతున్నారు. మార్కెటింగ్‌ జిల్లా అధికారి ఎం. సునిల్‌ వినరును వివరణ కోరగా జిల్లాలో డిమాండ్‌ నేపథ్యంలో ఉన్నతాధికారులకు తెలియజేశామని దేశీయ మార్కెట్లో కొరత ఏర్పడిందని సమాధానం ఇచ్చారు. అందుబాటులోకి వస్తే రైతు బజార్లు ద్వారా కొనుగోలు దారులకు అందజేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు.