కేరళలో బస్సు ప్రమాదంపై సర్వత్రా ఆందోళన
నలుగురికి తీవ్ర గాయాలు
అక్కడి అధికారులతో మాట్లాడిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
కేరళ ప్రభుత్వ స్పందన తీరుపై దెందులూరు ఎంఎల్‌ఎ అబ్బయ్యచౌదరి హర్షం
ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్
కేరళలో శబరిమల ప్రాంతంలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ఏలూరు ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. అయ్యప్ప మాలధారణలో శబరిమల వెళ్లిన తమ వారు ఎలాగున్నారో అంటూ ఆరా తీశారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు మినహా మిగిలిన వారంతా సురక్షితంగా ఉన్నారని సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఏలూరు రూరల్ మండలం చాటపర్రు, మాదేపల్లి ప్రాంతాలకు చెందిన 80 మంది అయ్యప్ప మాలధారులు ఈ నెల 15న చిలకలూరిపేటకు చెందిన రెండు ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో కేరళ రాష్ట్రంలోని శబరిమల బయల్దేరి వెళ్లారు. వారంతా అయ్యప్పస్వామి దర్శనం పూర్తి చేసుకున్నారు. 80 మందిలో 40 మంది శబరిమలలోనే తమ మాలలను తీసివేశారు. మాలలు తీసివేసిన వారంతా ఒక బస్సులో ఎక్కగా, పంబ నది సమీపంలో మాలలు తీసేందుకు మరో నలభై మంది శబరిమల నుండి తిరుగు ప్రయాణమయ్యారు. శనివారం ఉదయం ఎనిమిదిన్నర ప్రాంతంలో పంబ సమీపంలోని పత్తనంథిట్ట చేరుకునేసరికి మాలధారులు ప్రయాణిస్తున్న బస్సు స్టీరింగ్ లోపం తలెత్తింది. ఫలితంగా ఘాట్ రోడ్డు మలుపులో బస్సు మలుపు తిరగకుండా నేరుగా లోయలో పడిపోయింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 18 మందికి గాయాలవ్వగా వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని పత్తనంథిట ఆసుపత్రికి తరలించి తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కొట్టాయం వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆ ప్రాంత ఎంఎల్‌ఎ ప్రమోద్ నారాయణ పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అంతా సురక్షితంగా ఉన్నారని, అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఎటువంటి ఆందోళనా చెందొద్దని చెప్పారు.
అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం
కేరళలో బస్సు ప్రమాదంలో జిల్లావాసులు గాయపడ్డారనే సమాచారం తెలియగానే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పత్తనంథిట్ట జిల్లా కలెక్టర్, ఎస్‌పిలతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్బంగా కొంతమంది అయ్యప్ప భక్తులతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడి వారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయాల పాలైన వారి కుటుంబాలను దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్యచౌదరి పరామర్శించారు. ఆయన వెంట ఏలూరు ఆర్‌డిఒ కె.పెంచలకిషోర్, తహశీల్దార్ బి.సోమశేఖర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సిఎం జగన్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారన్నారు. అక్కడి వైద్యఆరోగ్య శాఖా మంత్రి, ఆ ప్రాంత ఎంఎల్‌ఎ వెంటనే స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించడంతోపాటు క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. కేరళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో మణికంఠ (8) కుడికాలికి శస్త్రచికిత్స చేస్తున్నారన్నారు. రాజశేఖర్(33), గోపీ, రాజేష్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. తరుణ్‌కు శ్వాస సంబంధిత సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. బాధితులందరినీ ఏలూరు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.










