Feb 16,2022 07:10

రష్యా, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మధ్య కుదిరిన మిన్స్క్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండడమే ప్రస్తుత ప్రతిష్టంభనకు ఏకైక మార్గం. ఆ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో అమెరికా కూడా భాగస్వామి. ఈ ఒప్పందంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకూడదని, రష్యా అనుకూల వేర్పాటువాద ఆధారిత ప్రాంతం (డాన్‌బాస్‌) నుంచి రష్యన్‌ దళాల (వలంటీర్స్‌)ను ఉపసంహరించుకోవాలని, నిస్సైనికీకరణను పాటించాలని, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలని, డాన్‌బాస్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలని, రష్యాతో సరిహద్దును ఆనుకుని వున్న ప్రాంతంతో సహా ఉక్రెయిన్‌ అంతటా అధికార వికేంద్రీకరణ జరపాలని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయాలన్న శ్రద్ధ ఉక్రెయిన్‌కు కానీ, అమెరికాకు కానీ లేదు. దీనికి భిన్నంగా, అంగీకృత అంశాల అమలును ధిక్కరిస్తూ పావులు కదుపుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో ప్రస్తుత సంక్షోభానికి కారణం.

    క్రెయిన్‌ చుట్టూ ఉద్రిక్తతలు ముసురుకున్నాయి. ఉక్రెయిన్‌పై దండెత్తడానికే రష్యా వేలాది మంది సైనికులను సరిహద్దులకు తరలిస్తున్నదని అమెరికా, దాని మిత్ర దేశాలు ఆరోపిస్తున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయంటూ ఉక్రెయిన్‌ లోని తమ రాయబార కార్యాలయ సిబ్బందిని అవి వెనక్కి పిలిపించుకున్నాయి. అమెరికా, రష్యా రెండూ అణ్వాయుధాలతో సహా అత్యంత అధునాతన ఆయుధాలను కలిగి వుండడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచాయి.
    ప్రస్తుత పరిస్థితికి కారణాలను అర్థం చేసుకోవాలంటే మనం గత చరిత్ర లోకి వెళ్లాలి. ఉక్రెయిన్‌, రష్యా చాలా కాలంగా ఉమ్మడి చరిత్ర, సంస్కృతి సంబంధాలు కలిగినట్టివి. సోవియట్‌ యూనియన్‌ ఏర్పడినప్పుడు ఉక్రెయిన్‌ అందులో విలీనం అయ్యింది. రష్యన్‌ భాష మాట్లాడే కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్‌లో చేర్చబడ్డాయి. 1990 లలో సోవియట్‌ యూనియన్‌ పతనమైన తరువాత రష్యన్‌ సమాఖ్య నుంచి విడిపోయినప్పటికీ, పాత సరిహద్దులనే ఉక్రెయిన్‌ కొనసాగించింది.
    రొనాల్డ్‌ రీగన్‌ కాలంలో సోవియట్‌ రష్యాకు వ్యతిరేకంగా పెద్దయెత్తున దుష్ప్రచారం సాగించారు. రేడియో లిబర్టీ పేరుతో ఉక్రెయిన్‌ ప్రాంతంలో పుకార్లు వ్యాపింపజేశారు. జాతీయవాద సెంటిమెంట్‌ను రెచ్చగొట్టారు. వీరి కుతంత్రాలు ఫలించి ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతానికి, రష్యాతో సాంప్రదాయకంగా సన్నిహిత సంబంధాలు కలిగి వున్న దాని తూర్పు ప్రాంతానికి మధ్య అగాథం పెరిగింది. సోవియట్‌ యూనియన్‌ను కట్టడి చేయడమే నాటో ఏర్పాటు వెనక ఉద్దేశం. యుఎస్‌ఎస్‌ఆర్‌ ఉనికిలో లేనందున నాటోకు ముగింపు పలుకుతారని అందరూ భావించారు. నాటోను ఎదుర్కోవడానికి ఏర్పాటైన వార్సా కూటమి సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాల పతనంతో అంతర్థానమైపోయింది. క్రమంగా నిరాయుధీకరణ, అణ్వాయుధ నిల్వల తగ్గింపునకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో నాటో వంటి సైనిక కూటముల అవసరం లేదన్న అభిప్రాయం సహజంగానే ఏర్పడింది. కానీ, నాటోను రద్దు చేయడానికి బదులు అనేక తూర్పు యూరపు దేశాలకు అది క్రమంగా విస్తరించింది.
    పోలండ్‌, చెకొస్లావేకియా, హంగరీలను తనలో చేర్చుకోవడం ద్వారా 1990ల నాటి స్థితి నుంచి నాటో వేగంగా విస్తరించనారంభించింది. తూర్పు దిశగా నాటో విస్తరణ రష్యా సరిహద్దుల వద్ద మాత్రమే ఆగుతుందని చివరికి జార్జియా, ఉక్రెయిన్‌లను కూడా ఈ సైనిక కూటమిలో చేర్చుకుంటుందని క్రమంగా వెల్లడైంది. ఈ చర్యల పట్ల రష్యా తీవ్ర అభ్యంతరం తెలిపింది. రష్యాను అస్థిరపరచి, దానిని పూర్తిగా బలహీనపరచడం, దాని వృద్ధిని అడ్డుకోవడమే అమెరికా పన్నాగంలో అత్యంత కీలకమైన అంశం.
    ఏది ఏమైనప్పటికీ రష్యా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండడంతో తన స్థానాన్ని పటిష్టపరచుకునేందుకు అది యత్నిస్తుండడం, ఆర్థిక సంక్షోభాల్లో చిక్కుకుని అమెరికా బలహీనపడుతుండడం, మరోవైపు చైనా ఒక తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుండడం భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో మార్పును సూచిస్తున్నాయి. 2008లో రష్యా నాటో విస్తరణను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించింది. నాటో కూటమిలో జార్జియా, ఉక్రెయిన్‌ను చేర్చుకుంటే ఖబడ్డార్‌ అని హెచ్చరించింది. అయినా, ఈ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉక్రెయిన్‌పై అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. చివరికి దానిని నాటోలో చేరమని బలవంతం చేసింది. పశ్చిమ దేశాల కూటమిలోకి ఉక్రెయిన్‌ను చేర్చుకోవడమంటే అర్థం అయిదు నిమిషాల్లో వాటి క్షిపణులు మాస్కోను తాకగల సామర్థ్యాన్ని సంతరించుకోగలగడమే. అప్పుడు రష్యా వాయు రక్షణ వ్యవస్థలు పనికిరానివిగా, అవసరానికి కొరగాకుండా పోయే అవకాశముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
    సోవియట్‌ యూనియన్‌ నుంచి ఉక్రెయిన్‌ విడిపోయిన తరువాత వివిధ జాతుల మధ్య, ప్రత్యేకించి పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లో నివసించే వారి మధ్య సమతౌల్యాన్ని కలిగి ఉండే ఉక్రెయిన్‌ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్‌ నుంచి విడిపోయాక ఆర్థిక కష్టాలు-అసమానతలు, నిరుద్యోగం, పేదరికం-ముమ్మరించడం, సోవియట్‌ యూనియన్‌ నాటి సామాజిక భద్రతా వ్యవస్థలన్నీ నాశనం కావడంతో సామాన్యుల జీవనం కడు దుర్భరంగా మారింది. మరో వైపు ఆర్థిక వ్యవస్థ ఆయువు పట్టును తమ గుప్పెట్లో పెట్టుకున్న అపర కుబేరులు సకల భోగాలను అనుభవిస్తున్న పరిస్థితి. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యలపై దృష్టి సారించడంలో విఫలం కావడంతో ప్రజల్లో అసంతృప్తి రాజుకుంది. సామ్రాజ్యవాద శక్తులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వివిధ జాతుల మధ్య మరీ ముఖ్యంగా రష్యన్లకు వ్యతిరేకంగా అసమ్మతిని మరింతగా ఎగదోసేందుకు పన్నాగాలు పన్నాయి.
     ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన దేశాధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిచ్‌ను కూలదోసేందుకు అమెరికా 'రంగు విప్లవానికి' తెర తీసింది. యనుకోవిచ్‌ రష్యాకు సన్నిహితంగా ఉంటూ, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేశాడు. అంతేకాదు, యూరోపియన్‌ యూనియన్‌, ఐఎంఎఫ్‌ రుణం కోసం విధించిన 'పొదుపు చర్యలు' వంటి షరతులను అమలు చేసేందుకు తిరస్కరించాడు. అందుకు బదులు రష్యా సాయం కోరాడు. అడిగినదే తడవుగా రష్యా 1500 కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చింది. రాయితీతో సహజ వాయువును అందించడంతో ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థ తేరుకోనారంభించింది. తద్వారా సామ్రాజ్యవాదులకు ఆయన పెద్ద సవాల్‌ విసిరినట్లైంది. దీంతో యనుకోవిచ్‌ను పడగొట్టేందుకు అమెరికా అన్ని రకాల కుతంత్రాలు పన్నింది. అవి 2014లో ఫలించాయి. దీంతో పదవీచ్యుతుడైన యనుకోవిచ్‌ దేశం వీడి పారిపోవలసి వచ్చింది. ఆయన స్థానంలో పచ్చి మితవాద, నియో నాజీ గ్రూపులు అధికారంలోకి వచ్చాయి. అవి నిరంకుశత్వ, సామ్రాజ్యవాద అనుకూల, యూరోపియన్‌ అనుకూల, నాటో అనుకూల వైఖరి చేపట్టాయి. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న రష్యన్లపై దాడులకు తెగబడ్డాయి. ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీ (కెపియు) కార్యాలయాల పైన దాడులు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా పలువురు నాయకులను ప్రభుత్వం అరెస్టు చేయించింది. ప్రజాతంత్ర హక్కులను కాలరాసింది. కెపియు కార్యకలాపాలకు తీవ్ర ఆటంకాలు కలిగించింది. ఉక్రెయిన్‌లో రష్యన్‌ జాతీయులపై దాడులు రష్యన్లు అధిక ప్రాబల్యం కలిగిన క్రిమియా 'విముక్తి'కి, అలాగే డాన్‌బాస్‌ ప్రాంతంలో పోరాడుతున్నవారికి సహాయంగా రష్యా తన దళాలను పంపే పరిస్థితిని కల్పించింది.
    రష్యాతో సయోధ్య కోసం కృషి చేస్తానని, ఉక్రెయిన్‌లో శాంతి, సుస్ధిరతను తీసుకొస్తానన్న హామీతో 2019 ఎన్నికల్లో వ్లదిమిర్‌ జెలెన్‌స్కీ అధ్యక్షుడిగా గెలిచాడు. అయితే, అతను తన హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. ఉక్రెయిన్‌పై సామ్రాజ్యవాద అమెరికా ప్రభావం పెరుగుతుండడం తన ఆర్థిక ప్రయోజనాలకు హానికరమని భావించిన రష్యా యూరోపియన్‌ దేశాలకు గ్యాస్‌ సరఫరా చేయడానికి నార్డ్‌2 గ్యాస్‌ పైప్‌లైన్‌ను ప్రారంభించింది. ఈ పైప్‌లైన్‌ మార్గం పూర్తిగా ఉక్రెయిన్‌కు పక్క నుంచి వెళ్తుంది. ఉక్రెయిన్‌ మీదుగా వెళ్లే నార్డ్‌1 గ్యాస్‌ పైప్‌లైన్‌కు పూర్తి భిన్నమైన రూటు ఇది. దీని వల్ల ఉక్రెయిన్‌ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా (పైప్‌లైన్‌ తన భూభాగం మీదుగా వెళ్లడానికి అనుమతించడం వల్ల లభించే ఆదాయాన్ని కోల్పోతుంది) రష్యాను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి (గ్యాస్‌ సఫరాను నిలిపివేస్తామని, దాని మార్కెట్‌తో అనుసంధానాన్ని ఆపేస్తామని బెదిరించేందుకు) గల వ్యూహాత్మక అవకాశాన్ని కూడా కోల్పోయింది.
     ఉక్రెయిన్‌ను ఎట్టి పరిస్థితుల్లోను తన అధీనంలో నుంచి జారి పోకుండా చూడాలని అమెరికా సామ్రాజ్యవాదం ఇంత గట్టిగా పట్టుబట్టడానికి మరో కారణం కూడా ఉంది. రష్యా యురేసియన్‌ దేశాలతో కలసి కూటమి కట్టాలని అనుకుంటున్నది. ఆ కూటమిలో ఉక్రెయిన్‌ చేరితే రష్యా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. ఈ దేశాల్లో చాలా వరకు ఇప్పటికే రష్యా, చైనాతో స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్‌ వీటితో కలిస్తే రష్యా, చైనాలకు అది మరింత బలం చేకూర్చడమే కాకుండా, ఈ ప్రాంతంలో సామ్రాజ్యవాదానికి ఎలాంటి స్థావరం లేకుండా చేయొచ్చు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో ఎదురుదెబ్బ తిన్న అమెరికా ఆధిపత్యవాదానికి ఇది మరో పెద్ద దెబ్బ కాగలదు.
    దీనికితోడు కోవిడ్‌ మహమ్మారిని అదుపు చేయడంలోను, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలోను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వైఫల్యాన్ని పడిపోతున్న ఆయన రేటింగ్స్‌ సూచిస్తున్నాయి. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు 'అమెరికా ఈజ్‌ బ్యాక్‌ ఎగైన్‌' అంటూ ఆయన పటాటోపం ప్రదర్శిస్తున్నారు. కండబలంపై ఆధారపడిన విదేశాంగ విధానాన్ని దూకుడుగా ముందుకు తెస్తున్నారు. తన చర్యను సమర్థించుకోవడానికి రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తబోతోందంటూ మోసపూరిత ప్రచారం చేస్తున్నారు. అదే సాకుతో అమెరికా సైన్యాన్ని ఉక్రెయిన్‌కు తరలిస్తున్నది.
    రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, తన నాటో మిత్రపక్షాలనన్నిటినీ సమీకరించేందుకు చేస్తున్న యత్నాలకు జర్మనీ, ఫ్రాన్స్‌ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తేందుకు సిద్ధమవుతున్నదంటూ అమెరికా చేస్తున్న ప్రచారానికి వత్తాసు పలికేందుకు అవి సిద్ధంగా లేవు. ఉక్రెయిన్‌ను నాటో కూటమిలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఇంతకు ముందు వీటో చేశాయి. రష్యా నుంచి చౌకగా వస్తున్న సహజవాయువుపై పలు యూరోపియన్‌ దేశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ రీత్యా రష్యాతో సంబంధాలు తెంచుకునేందుకు అవి సుముఖంగా లేవు. ఉక్రెయిన్‌లో నియో నాజీల ముప్పు, అక్కడి అవినీతి, నిరంకుశ పాలన గురించి వీటికి ఎరుకే. వాటి పర్యవసానాలు ఆ దేశాలకు అనుభవైకవేద్యమే. రష్యాతో సైనిక సంఘర్షణ వల్ల తలెత్తే పరిణామాల గురించి అవి ఆందోళన చెందుతున్నాయి. రష్యా అధునాతన సైనిక సాంకేతికతను కలిగి ఉంది. దాంతో యుద్ధం యూరోపియన్‌ దేశాలకు మాత్రమే కాకుండా యావత్‌ మానవాళికి వినాశకరంగా పరిణమిస్తుంది.
     రష్యా, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ మధ్య కుదిరిన మిన్స్క్‌ ఒప్పందానికి కట్టుబడి ఉండడమే ప్రస్తుత ప్రతిష్టంభనకు ఏకైక మార్గం. ఆ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులో అమెరికా కూడా భాగస్వామి. ఈ ఒప్పందంలో ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకోకూడదని, రష్యా అనుకూల వేర్పాటువాద ఆధారిత ప్రాంతం (డాన్‌బాస్‌) నుంచి రష్యన్‌ దళాల (వలంటీర్స్‌)ను ఉపసంహరించుకోవాలని, నిస్సైనికీకరణను పాటించాలని, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించాలని, డాన్‌బాస్‌కు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించాలని, రష్యాతో సరిహద్దును ఆనుకుని వున్న ప్రాంతంతో సహా ఉక్రెయిన్‌ అంతటా అధికార వికేంద్రీకరణ జరపాలని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. అయితే, ఈ ఒప్పందాన్ని అమలు చేయాలన్న శ్రద్ధ ఉక్రెయిన్‌కు కానీ, అమెరికాకు కానీ లేదు. దీనికి భిన్నంగా, అంగీకృత అంశాల అమలును ధిక్కరిస్తూ పావులు కదుపుతున్నారు. ఇదే ఈ ప్రాంతంలో ప్రస్తుత సంక్షోభానికి కారణం.
    అమెరికా తన జోక్యందారీ వైఖరి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోకుండా, అవే విధానాలను కొనసాగిస్తున్నది. ఇప్పుడు మరో మధ్య ఆసియా దేశం కజకిస్తాన్‌ పీక నులిమేయాలని చూస్తున్నది. ఉక్రెయిన్‌లో మాదిరే అక్కడ కూడా తనకు అనుకూలమైన తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది అమెరికా పన్నాగం. రష్యా, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకున్న ఈ మొత్తం ప్రాంతాన్ని అస్థిరపరచేందుకు అది కుట్ర పన్నింది.
    ఉక్రెయిన్‌, కజకిస్తాన్‌లో పరిణామాలు అమెరికా తన ఆధిపత్యాన్ని యావత్‌ ప్రపంచంపై రుద్దేందుకు చేస్తున్న యత్నాలకు దర్పణం పడుతున్నాయి. తనతో పోటీగా ఏ దేశమూ మరీ ముఖ్యంగా చైనా, రష్యా ఎదగడాన్ని అమెరికా సహించలేకపోతున్నది. తనను చుట్టుముట్టిన తీవ్ర సంక్షోభం నుంచి బయటపడడం కోసం అది ఇతర దేశాలపై తన సైనిక బలాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నది. ఇలాంటి యత్నాలు ఎన్నటికీ ఫలించవని చరిత్ర చెబుతోంది. అమెరికా, దాని సామ్రాజ్యవాద మిత్రులకు మరోసారి అదే గుణపాఠాన్ని నేర్పాలి. మానవాళి మనుగడకు, ప్రపంచ శాంతికి ఇది అత్యంతావశ్యకం.

( వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు )
ఆర్‌. అరుణ్‌ కుమార్‌

ఆర్‌. అరుణ్‌ కుమార్‌