ప్రజాశక్తి - గుంటూరు : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునేందుకు సాగుతున్న పోరాటానికి మద్దతుగా నేడు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. నాయకులకు నోటీసులు ఇచ్చి ఆందోళనలో పాల్గొనకుండా కట్టడికి ప్రయత్నిస్తున్నారు. అయితే ముందస్తు అరెస్టులు, నోటీసులతో ఉద్యమాన్ని ఆపలేరని సిఐటియు గుంటూరు నగర తూర్పు ,పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు అన్నారు. రాస్తారోకోని భగం చేయాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా సిఐటియు నాయకులకు, విద్యార్థి సంఘం నాయకులకు నోటీసులు ఇవ్వడం స్టేషన్లకు తీసుకెళ్లటం తగదని అన్నారు. తమతోపాటు సిఐటియు తాడికొండ మండల కార్యదర్శి గాంధీ రామ్మోహన్‌రావు, ఫిరంగిపురం మండల కార్యదర్శి మస్తాన్ వలికి నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ చర్యతో కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరుగుతుందని హెచ్చరించారు.
ప్రజాశక్తి-ఫిరంగిపురం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం బుధవారం రాస్తారోకోలు చేస్తున్నట్లు పిలుపనిచ్చిన నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు వెళ్లవద్దంటూ సిఐటియు ఫిరంగిపురం మండల ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్‌వలికి పొనుగుపాడు మహిళా పోలీసులు నోటీసులు అందజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కలిసి వస్తామని చెబుతున్న వైసిపి ప్రభుత్వం మరోపక్క పోరాటం పై నిర్బంధం ప్రయోగించడం బిజెపి విధానాలను సమర్థించడమే అని మస్తాన్‌వలి విమర్శించారు.
ప్రజాశక్తి-తాడేపల్లి : 33 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పార్టీలకతీతంగా ప్రజలందరూ కదిలిరావాలని సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఎఐటియుసి, టిఎన్‌టియుసి నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తాడేపల్లి సిపిఎం కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా డివిడెండ్లు రూపంలో లాభాలు అందాయని తెలిపారు. లాభాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దుర్మార్గమైన చర్యన్నారు. 700 రోజులు పైబడి సాగుతున్న ఉక్కు కార్మికుల దీక్షను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కాదని ఇదే విధంగా ముందుకు వెళ్తే ప్రజలతో కలిసి కార్మికవర్గంతగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఆదానీ లాంటి కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ విధానాలను మానుకోకపోతే తగిన మ్యూలం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ఉక్కు కార్మికుల ధృడ సంకల్పానికి మద్దతుగా బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి ఎంఆర్‌ఒ కార్యాలయం ఎదురుగా రాస్తారోకో చేస్తామని అఖిలపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు ప్రకటించాయి. సమావేశంలో నాయకులు బి.వెంకటేశ్వర్లు, కె.కరుణాకరరావు, వి.దుర్గారావు, టి.నాగేశ్వరరావు, డి.దశరధరామిరెడ్డి, ఎస్‌కె బాష, జి.సుంకన్న, ఎ.మురళి, డి.దాసు, కె.కాశయ్య, టి.వెంకటయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నరసరావుపేట : విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకం పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు 800 రోజులకు పైగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిపిఎం, సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం 9 గంటల నుండి 11 గంటల వరకు నరసరావుపేటలోని గుంటూరు - కర్నూలు జాతీయ రహదారి మార్గంలో వై.జంక్షన్ వద్ద రాస్తోరోకో చేస్తున్నట్లు సిపిఎం పట్టణ కార్యదర్శి సిలార్ మసూద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు తెలిపారు. ఈ మేరకు స్థానిక సిపిఐ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. రాస్తారోకోలో అన్ని రంగాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.










