ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్ ప్లాంట్ పట్ల ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించడం దుర్మార్గమని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి అన్నారు. స్టీల్ సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ, యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలు అంటూ స్థానిక యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించకుండా ప్లాంట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టె నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గమన్నారు. ఈ విషయాన్ని ప్లాంట్‌లోని అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తూ న్యూఢిల్లీలో కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. ఈ నిర్ణయంపై సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల కేంద్ర నిర్ణయంపై రాష్ట్రంలోని పార్టీలు ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జి 20 సదస్సు ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించిన సమయంలో కూడా దీనిపై జరుగుతున్న కుట్రను ముఖ్యమంత్రి ప్రస్తావించలేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో పోరాటానికి సహకరించడం లేదన్నారు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ఐక్యపరిచి ఉద్యమాలతో ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు.
స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్, మిత్రపక్షాల నాయకులు డివి.రమణారెడ్డి, డి.సురేష్‌బాబు, సిహెచ్ సన్యాసిరావు మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై ఏప్రిల్ 5వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. దేశంలోని మిగిలిన స్టీల్ ప్లాంట్లకు విశాఖ ఉక్కు కర్మాగార స్థాపనలో గల వ్యత్యాసాన్ని గమనించకుండా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఐక్య కార్యాచరణతో ప్రతిఘటించాలని, ఆ దిశగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, గంగాధర్, టివికె.రాజు, కెవి సత్యనారాయణ, డి.కృష్ణమూర్తి, బిఎన్.మధుసూదన్, డిఎస్‌ఆర్‌సి.మూర్తి, శ్రీనివాసులురెడ్డి, విడివి పూర్ణచంద్రరావు, డిఎస్‌విఎస్ శ్రీనివాస్, శశిరెడ్డి, బి.మహేష్, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, మిత్రపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.










