సీతంపేట/పాలకొండ: విశాఖ ఉక్కును ప్రయివేటు పరం చేస్తే ఊరుకునేది లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యాన నిర్వహించిన ఉక్కు రక్షణ బైక్ యాత్ర శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, కొత్తూరు మీదుగా శనివారం రాత్రి సీతంపేట, పాలకొండకు చేరుకుంది. సీతంపేటలోని బస్టాండ్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి కె.లోకనాథంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల కార్యదర్శులు గోవిందరావు, రెడ్డి వేణు పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకొండలోని ఆర్‌టిసి కూడలి వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ ఉత్పత్తి చేసే సంస్థగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందన్నారు. తక్కువ మంది కార్మికులతో దేశంలోనే అత్యధిక ఉత్పత్తినిస్తున్న ప్లాంట్ మనదేనని అన్నారు. అంతేకాక ఉత్తరాంధ్ర ప్రజలకు, యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. 32మంది బలిదానం, ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కావున స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి మన ప్రాంత ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వైసిపి, టిడిపి, జనసేన వ్యతిరేకించడం లేదన్నారు. మనం పోరాడి సాధించుకున్న ప్లాంటును రక్షించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, పాలకొండ మండల కన్వీనర్ దావాల రమణ, కాద రాము, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి : సిపిఎం
బెలగాం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అటు కార్మికులకు, రైతాంగానికి, ఇటు వ్యవసాయ కూలీలకు ఎవర్నీ ఆదుకునే పరిస్థితి లేదని, రాష్ట్రంలో ఉత్తరాంధ్రాకు ఎంతో ఉపయోగకరమైన, అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేసే బిజెపి ప్రభుత్వ చర్యలను ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకర్ అవుతున్నా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు స్పందించకపోవడం దురదకరమన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉత్తరాంధ్ర ప్రజలపై ఉందని అన్నారు. ఇందులో భాగంగా సిపిఎం ఉత్తరాంధ్ర జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆరు జిల్లాల్లో 1150 కిలోమీటర్లు ఉక్కు రక్షణ బైకు యాత్ర చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు పర్యటిస్తుందని తెలిపారు. శనివారం పాలకొండ చేరుకొని సభ అనంతరం అక్కడే బస చేస్తుందన్నారు. ఆదివారం ఉదయం 9గంటలకు కురుపాం, మధ్యాహ్నం 12 గంటలకు పార్వతీపురం చేరుకుంటుందని తెలిపారు. పార్వతీపురం నవిరి కాలనీ వై జంక్షన్ వద్ద నుండి బ్రిడ్జి, పాత బస్టాండ్ మీదుగా బెలగాం కాంప్లెక్స్ కూడలి వద్ద బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. అనంతరం సాలూరుకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుందన్నారు. కావున ఈ బైక్ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఇందిరా, జిల్లా కమిటీ సభ్యులు బంటు దాసు, గొర్లి వెంకటరమణ, రెడ్డి శ్రీదేవి, కె.రామస్వామి పాల్గొన్నారు.
సాలూరురూరల్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపాలని సిపిఎం ఆధ్వర్యాన చేపడుతున్నఉత్తరాంధ్ర బైక్ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు మండలంలోని మామిడిపల్లిలో ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీ ఆదివారం సాలూరు పట్టణానికి చేరుకుంటుం దన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వంతల సుందర్రావు, తాడంగి గాసి, వ్యవసాయ కార్మిక సంఘం, మండల అధ్యక్షులు జన్ని ఈశ్వరరావు, గిరిజన సంఘం మండల కమిటీ సభ్యులు గూడెపు పోలిరాజు, తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ : పార్వతీపురంలో జరిగే ఉక్కు పరిరక్షణ బైక్ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కొమరాడలో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మధుసూదన్ రావు, బి.వెంకటనాయుడు, సింహాచలం, ఆదిబాబు, సాయిరాం, అక్కులనాయుడు, స్వామినాయుడు పాల్గొన్నారు.










