బిసి గేట్ వద్ద ఉద్రిక్తత..ఆందోళనకు దిగిన స్టీల్ కార్మికులు
బాధ్యునిపై చర్యలకు కార్మిక సంఘాల డిమాండ్
ప్రజాశక్తి- ఉక్కునగరం : స్టీల్ ప్లాంట్ బిసి గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ సెంట్రల్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటింగ్ మెకానిక్‌గా విధులు నిర్వహిస్తున్న వి.కుమార్ అనే ఉద్యోగి జనరల్ షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు బిసి.గేట్ నుంచి లోపలికి ప్రవేశించే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ధర్మేంద్ర సింగ్ అనే సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనతో కార్మికునిపై పిడుగుద్దులు గుద్దడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాయపడిన కార్మికుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఉక్కు జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.
ఉక్కు ఉద్యోగిపై సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది దాడికి నిరసనగా స్టీల్ కార్మికులు అక్కడే బైఠాయించి ఆందోళన చేశారు. దాడికి పాల్పడిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అన్ని కార్మిక సంఘాల నాయకులు సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది తీరుపై విచారం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిరసనలో కార్మిక సంఘాల నాయకులు అయోధ్యరాం, వైటి దాసు, మంత్రి రాజశేఖర్, నీరుకొండ రామచంద్రరావు, కెఎస్‌ఎన్ రావు, డివి.రమణ, జె రామకృష్ణ, మస్తానప్ప, కామేశ్వరరావు, వరసాల శ్రీనివాసరావు, సిహెచ్ సన్యాసిరావు, దొమ్మేటి అప్పారావు, డి సురేష్ బాబు, నమ్మి సింహాద్రి, బి మల్లయ్య, బిఎంకె నాయక్, కారు రమణ, కొమ్ము ప్రసాద్ పాల్గొన్నారు .










