ప్రజాశక్తి-ఉక్కునగరం : దేశవ్యాప్త ప్రయివేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి విశాఖ ఉక్కు ఉద్యమం స్ఫూర్తిదాయకమని స్టీల్ ఆఫీసర్స్ ఫెడరేషన్ పూర్వపు నాయకులు డాక్టర్ డిఎన్ శర్మ (రాంచీ), ఎఐటియుసి ఫెడరేషన్ నాయకులు రామ్ అగార్ సింగ్ (బొకారో) పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 637వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ఆర్‌ఎంహెచ్‌పి, ఎసిఎస్, హెచ్‌ఆర్ విభాగాల కార్మికులు కూర్చున్నారు.ఈ దీక్షలకు వారు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ బిఎఫ్ - 3ను, మిగిలి ఉన్న విభాగాలను తక్షణమే పున్ణప్రారంభించాలని, 7.3 మిలియన్ టన్నులకు అనుగుణంగా ఉత్పత్తిని తీయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
రామ్ అగార్ సింగ్ మాట్లాడుతూ, భారతదేశంలోని ఏ స్టీల్ పరిశ్రమలోనూ ఇంతటి సుదీర్ఘ పోరాటం జరిగిన చరిత్ర లేదన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కే ఆ ఘనత దక్కుతుందన్నారు. స్టీల్ ఉద్యోగులకు ఇపిఎస్ 95 పింఛను పూర్తి జీతంపై ఇవ్వాలని సుదీర్ఘంగా న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో సాగిస్తున్నామని తెలిపారు. దానిపై తీర్పు వచ్చినప్పటికీ అమలుపై ఇపిఎఫ్‌ఒ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. దీన్ని అమలయ్యేలా చూడాలని యాజమాన్యాలను డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ, పోరాట కమిటీ నాయకులు ఎన్.రామారావు, జె.రామకృష్ణ, కె.రాజబాబు, గుమ్మడి నరేంద్ర, డిసిహెచ్.వెంకటేశ్వరరావు, జి.జయ, బిఎన్.రాజు, ఎంవి.రమణ తదితరులు పాల్గొన్నారు.










