Jul 29,2023 23:45

దీక్షలో కూర్చున్న కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో చేపట్టిన నిరవదిక రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 898వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఇఎండి, ఇఆర్‌ఎస్‌, సేఫ్టీ, టెక్‌, ఎస్‌ఎస్‌డి, ఆగ్రో విభాగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ, పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో టెంట్‌ వేసి ఈ నెల 31వ తేదీ నాటికి 900 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అన్ని నిర్వాసిత కాలనీలు, ఉక్కునగరం, కూర్మన్నపాలెంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. పోరాట కమిటీ సభ్యులు వారి వారి ప్రాంతాల్లో ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, ఆయా ప్రాంత ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొనేలా చైతన్యం కల్పించాలని కోరారు.