Oct 18,2023 20:54

హెలీప్యాడ్‌ వద్ద జెఎస్‌డబ్ల్యూ బృందంతో జపాన్‌ పరిశీలకులు

జమ్మలమడుగు రూరల్‌ : మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లి వద్ద కన్నెతీర్థం సమీపంలోని ఉక్కు పరిశ్రమ స్థలాన్ని జెఎస్‌డబ్ల్యూ, జపాన్‌ బృందం పరిశీలించింది. బుధ వారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌ వద్ద వారికి ఆర్‌డిఒ జి.శ్రీనివాసులు స్వాగతం పలికి ఉక్కు పరిశ్రమ స్థలాన్ని చూపించారు. అనంతరం జెఎస్‌డబ్ల్యూ, జపాన్‌ బృందం ముఖ్యమంత్రి మొదటిసారి వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు శంకుస్థాపన చేసిన విషయాన్ని, రెండవసారి జెఎస్‌డబ్ల్యూ వారిచే ఈ ఏడాది ఫిబ్రవరిలో శంకు స్థాపన చేసిన విషయానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ బి.బలరాం, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ డి.రామలింగేశ్వర, సైట్‌ మేనేజర్‌ కె.శాంతి స్వరూప్‌, డిఇఒ ఎస్‌.విజయకాంత్‌రెడ్డి జెఎస్‌డబ్ల్యూకు కేటాయించిన స్థలాన్ని, ఇక్కడి పరిస్థితుల గురించి వివరించినట్లు సమాచారం. స్థలాన్ని పరిశీలించిన బృందంలో జెఎస్‌ డబ్ల్యూ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యోగేష్‌ బేడీ, డైరెక్టర్‌ కనకారావు, డిజిఎం వికాస్‌ కుమార్‌, జపాన్‌కు చెందిన మునియోసో నకాటాని యమాటో కోజియో, తోసియుకి యోకోయమ, వైసిపి నాయకులు హనుమంత్‌రెడ్డి పాల్గొన్నారు.