Sep 29,2022 23:08

దీక్షనుద్దేశించి మాట్లాడుతున్న రామ్మోహన్‌కుమార్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : అక్టోబర్‌ 2న చేపట్టే ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రను జయప్రదంచేయాలని టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు విళ్ళా రామ్‌మోహన్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 546వ రోజుకు చేరాయి. దీక్షల్లో టిఎన్‌టియుసి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ నుంచి కాపాడుకోడానికి 546 రోజులుగా దీక్షలు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేస్తున్న దీక్షలు అక్టోబర్‌ 2వ తేదీ నాటికి 600 రోజులకు చేరుకుంటుందని, గాంధీ జయంతి స్ఫూర్తితో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ నుంచి ఆర్‌కె.బీచ్‌ వరకు ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ధనంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు దారాదత్తం చేయాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో ఉండటం వల్ల లక్షలాది మందికి జీవనాధారంగా ఉందని, దీనిని నాశనం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయని విమర్శించారు. ఈ దీక్షల్లో యూనియన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఉప్పిలి రామకృష్ణ, సిహెచ్‌ కన్నారావు, ఎస్‌.చిన్నఅప్పారావు, దేవర అప్పలరాజు, పీలా వెంకటరమణ, నాగుల తిరుమలేష్‌, పల్లా సోమేష్‌, చైతన్య పాల్గొన్నారు.