Apr 18,2021 15:22

ఇది విప్లవగడ్డ
ఉత్తరాంధ్ర పురిటిగడ్డ
ఇది విశాఖ ఉక్కు
ఆంధ్రుల హక్కు
ముప్ఫైరెండు మంది బలిదానం
ఇది మా నెత్తుటి ఫలం
చేయి చేయి కలిపి
సాధించుకున్న కొలిమి సంపద
భుజం భుజం చేర్చి
ఉత్పత్తి చేస్తున్న వరాల పంట
కొండలు అడవులు దోచుకున్నట్టు
మా హక్కుని మా ఉక్కుని
లాక్కోడానికి ఎన్ని గుండెల్రా నీకు?
బంగారు బాతును చేతులు మార్చే
కుట్ర పన్నుతున్నావు
గనులు ఇవ్వకుండా
చోద్యం చూస్తున్నావు
అమ్మేదెవడు
ఫ్యాక్టరీ కొనేదెవడు
మధ్యలో మేమున్నాం
మా వెనుక పదమూడు జిల్లాల
ఉగ్ర నరసింహులున్నారు
నువ్వు ఢిల్లీదాటి
మా నేలమీద
అడుగుపెట్టి చూడు
కణకణ మండే అగ్నికణాలు
భగభగ మండే నెత్తుటి గుండెలు
ఎర్రెర్రని నిప్పుల కొలిమిలో
నిన్ను భస్మం చేస్తాయి
రాజీకొస్తావో
రాజకీయం చేస్తావో
బస్తీమే సవాల్‌
దూరాన కూర్చుని ఆడించడానికి
మేం ఆటబొమ్మలం కాదు
పిడికిళ్ళు బిగించాం
ప్రాణాలకు తెగించాం
ఇది మరో ఉక్కు ఉద్యమం
ఆంధ్రుల సమర శంఖారావం
వెనకడుగు వేసేది లేదు
తెగేదాక లాగుతాం
తాడోపేడో తేల్చుకుంటాం
ఉక్కు మాది
మాట్లాడే హక్కులేదు మీకు
కార్మికులు మీ పాలికాపులు కాదు
ఫ్యాక్టరీ భూముల్లో కొంత అమ్మయినా
విశాఖ ఉక్కును కాపాడుకుంటాం
సామూహికంగా రక్షించుకుంటాం
ఉక్కుకోటని దక్కించుకుంటాం
ఇది మా ఉక్కు సంకల్పం
మా ఐక్యతా నినాదం

- చొక్కర తాతారావు
6301192215