ప్రజాశక్తి- శృంగవరపుకోట : ఈ నెల 20 నుండి 29 విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై జరగనున్న ఉక్కు రక్షణ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వెంకటరమణ పేట వద్ద గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గాడి అప్పారావు, నాయకులు చల్లా జగన్, మద్దిల రమణ మాట్లాడుతూ తెలుగు ప్రజలు పోరాడి 32 మంది రైతన్నలు ప్రాణత్యాగాలతో 16వేల మంది రైతులు 22 వేల ఎకరాల భూమి త్యాగఫలంతో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎలాగైనా ప్లాంటును రక్షించుకొని తీరుతామని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఈ ప్రాంత ప్రజలు గత 1000 రోజులగా పోరాడుతున్నారన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పులు లేదు సరి కదా దీనిని అమ్మడం సాధ్యం కాకపోతే మూసివేస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి బెదిరింపులకు పూనుకున్నారన్నారు. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రజలు కార్మికులు నీరసపడిపోయి ఉద్యమాన్ని ఆపివేస్తారని మోడీ ప్రభుత్వం భావించిందని అయితే వారి అంచనాలకు భిన్నంగా రెట్టింపు ఉత్సాహంతో పట్టుదలతో కార్మికులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 20 నుండి 29 వరకు ఉత్తరాంధ్ర బైక్ యాత్ర చేపట్టిందన్నారు. 20న విశాఖ జివిఎంసి స్టీల్ దీక్ష శిబిరం వద్ద యాత్ర ప్రారంభించి 29న కూర్మన్నపాలెం స్టీల్ దీక్షా శిబిరం వద్ద వేలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి భాస్కరరావు, టి. వెంకట అప్పారావు, జి. రామునాయుడు, టి. ఈశ్వరరావు, టి. కృష్ణ, కే. భాస్కర్ రావు, కే. రాము తదితరులు పాల్గొన్నారు.










