Sep 22,2023 21:13

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి- గజపతినగరం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ కోసం నిర్వహిస్తున్న ఉక్కు రక్షణ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బంగారమ్మ పేటలో సిపిఎం నాయకులు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి మోడీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా నష్టాలు ఊబిలోకి నెట్టేసి చివరకు ఎవరికీ తెలియకుండానే ప్లాంట్‌ అమ్మకానికి 2014లో బేర సారాలు కుదుర్చుకొని కుట్ర పన్నిందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు 1000 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్లాంట్‌ అమ్మి తీరుతామని మోడీ ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ల్యాండ్‌ నిర్వహణకు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరుతూ ఈ రక్షణ యాత్ర ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలలో 1150 కిలోమీటర్లు మేరా బైక్‌ యాత్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25న ఉదయం 9గంటలకు గజపతినగరం చేరుకుంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం గంగచోళ్లపెంట, మరుపల్లి, పాతబగ్గాం గ్రామాల్లో కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.