Nov 02,2023 00:52

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు : విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకణ ఆపాలని, కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ వై.కష్ణకాంత్‌ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ముఖ్యవక్తగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అపాలని ఉద్యమం ప్రారంభించి ఈనెల 8వ తేదీకి వెయ్యి రోజులు పూర్తవుతుందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్ధి, యువజన సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌కు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. 32 మంది బలిదానం, వేలాది మంది త్యాగాలతో నిర్మించిన విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరించాలని ప్రయత్నించటం దారుణమన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన హామీలలో భాగంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పినా 9 ఏళ్ల నుండి శంకుస్తాపనలకే పరిమితం అయ్యిందన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అన్ని వసతులు, దగ్గరలో ఓబులాపురం గనులు ఉన్నాయని, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకోవట్లేదని విమర్శించారు. పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎమ్‌.కిరణ్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యాక్షులు సుబాని, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు కట్టా జవహర్‌బాబు, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలి, ఎఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శి శశి, ఎన్‌యస్‌యుఐ నగర అద్యక్షులు షేక్‌ కరీం మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీగా ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు జరుగుతున్న బంద్‌కు జిల్లాలోని కెజి నుండి పీజీ వరకూ విద్యాసంస్థలు అన్నీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు అరుణ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు టి.నరసింహ, ఎస్‌.కె.సమీర్‌, నాయకులు భగత్‌సింగ్‌, యశ్వంత్‌, జిల్లా ఉపాధ్యక్షులు సుచరిత, మౌనిక వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.