May 04,2023 00:36

మద్దిలపాలెం కూడలిలో రాస్తారోకో

ప్రజాశక్తి-యంత్రాంగం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలో కొనసాగించాలని రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు బుధవారం విశాఖలో రాస్తారోకో నిర్వహించారు.
ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూర్మన్నపాలెం కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. రాస్తారోకో చేస్తున్న కార్మిక నేతలను, సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావును పోలీసులు అరెస్టు చేసి స్టీల్‌ప్లాంట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌, ఎన్‌.రామచంద్రరావు, శ్రీనివాసరావు, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, యు.రామస్వామి, కెఎం.శ్రీనివాసరావు, రమణమూర్తి, ఉమామహేశ్వరరావు, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, డి.శ్రీనివాస్‌, సిహెచ్‌.సన్యాసిరావు, ఎన్‌.రామారావు, వి.ప్రసాద్‌, రాజా, నాగేశ్వరరావు, గండి అప్పలనాయుడు సహా మొత్తం 26 మంది పోరాట కమిటీ నాయకులు అరెస్టయ్యారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక దివాలా కోరు విధానాలకు నిదర్శనమని, అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని కార్మిక నేతలు హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
గాజువాక : పాత గాజువాక జంక్షన్‌లో వామపక్షాలతోపాటు టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. మోడీ డౌన్‌ డౌన్‌, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని నినాదాలు చేశారు. దీంతో ఇక్కడ మూడు కిలోమీటర్లు మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాస్తారోకోనుద్దేశించి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. మోడీ విధానాలు అప్రజాస్వామికమని, ప్రజలంతా భాగస్వాములు కావాలన్న ఐక్య నినాదంతో ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి, పెదగంట్యాడ ప్రాంతాల్లో జరిగిన రాస్తారోకోలకు ప్రజలు సహకరించారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌చేశారు. దేశభక్తి ముసుగులో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దక్షిణ కొరియా కంపెనీకి అమ్మాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తోందన్నారు.
గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పోరాటాల ద్వారానే ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోగలమన్నారు.
గాజువాకలో చేపట్టిన రాస్తారోకోకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రజల సంపద అని, దీన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌పరం కానివ్వబోమన్నారు.
16 మంది అరెస్ట్‌
పాత గాజువాకలో రాస్తారోకో చేస్తున్న నాయకుల్లో 16 మందిని పోలీసులు అరెస్టు చేసి గాజువాక స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం నాయకులు ఎం.రాంబాబు, నమ్మి రమణ, గుర్రప్ప, ఎం.శ్రీదేవి, లక్ష్మి, వై.లక్ష్మణ్‌, సిపిఐ నాయకులు సత్యనారాయణ, టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు మస్తానప్ప తదితరులు ఉన్నారు.
పెందుర్తి : 94వ వార్డు పరిధి వేపగుంట కూడలిలో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ వల్ల వేలాదిమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అటువంటి ప్లాంట్‌ను ప్రయివేటీకరించడం దుర్మార్గమన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వానికి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వత్తాసు పలకడాన్ని ప్రజల గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అప్పలనాయుడు, రజిని, సిపిఐ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎంవిపి.కాలనీ : మద్దిలపాలెం కూడలిలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ, సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న వారిలో 25 మందిని పోలీసులు అరెస్టు చేసి ఎంవిపి.పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అరెస్టు చేసిన వారిలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు పడాల రమణ, సిపిఐ ఎంఎల్‌ (న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి వై.కొండయ్య, సిపిఐ జిల్లా నాయకులు ఎం.మన్మధరావు, సిపిఎం జిల్లా నాయకులు వి.కృష్ణారావు, పి.పైడిరాజు, వి.నరేంద్ర కుమార్‌, సిఐటియు నాయకులు పి.మణి, బి.జగన్‌, పి.వెంకటరావు, ఆర్‌.లక్ష్ణమూర్తి, కె.పెంటారావు తదితరులున్నారు.