Jul 26,2022 00:42

కూర్మన్నపాలెం వద్ద దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఆదినారాయణ

ప్రజాశక్తి - ఉక్కునగరం
వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను పోరాటాలతో తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 529వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ పలు విభాగాలకు చెందిన కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ, ప్రతినిధి ఎల్లేటి శ్రీను మాట్లాడారు. వందలాది రోజులుగా ఉక్కు కార్మికులు దీక్షలు, పోరాటాలు చేస్తున్నా కేంద్రానికి చీమకుట్టినట్టుగా కూడా లేకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో తమ పోరాట సెగ ఢిల్లీని తాకేలా ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల నిరాహార దీక్షకు కార్మికులు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. దొడ్డి దారిన ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి ఉక్కు యాజమాన్యంతో కలిసి మోడీ సర్కారు విద్రోహ చర్యలకు దిగుతోందని అన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు మురళీరాజు, ఉమామహేశ్వరరావు, శ్రీరామచంద్రరావు, శ్రీనివాసరెడ్డి, చింతల అప్పారావు, బి.సాయిరాం, వై.నాగేశ్వరరావు, పిఎస్‌ఎ.నాయుడు, కె.రామకోటి, వీరబాబు, కెవిఎస్‌.గణేష్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, క్యుఎటిడి విభాగాల కార్మికులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ : స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు సోమవారానికి 470వ రోజుకు చేరాయి. దీక్షల్లో మురికివాడల నివాసుల సంక్షేమ సంఘం కార్యకర్తలు కూర్చున్నారు. సంఘం అధ్యక్షులు కె.రవి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జరిగిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేశారను. కార్యక్రమంలో పిఒడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి, ఎంఎన్‌ఎస్‌ఎస్‌ నగర ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మీనారాయణ, నాయకులు ఈసర లక్ష్మి, పరదేశి, కుమారి, జయ, కృష్ణ పాల్గొన్నారు.