ప్రజాశక్తి - ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్)
కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కు సాధ్యం కాదని పార్లమెంటు సాక్షిగా చెప్పడం దారుణమని, దీనిపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి స్పష్టమైన వైఖరి తెలపాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై దుర్మార్గంగా వ్యవ హరిస్తోందన్నారు. విభజన చట్టంలో స్పష్టంగా రాష్ట్రానికి కడప ఉక్కును చట్టబద్దంగా కేటాయించినా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు కడప ఉక్కును ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటోందన్నారు. కడప ఉక్కు ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ అన్నారు. యువతకు సంజీవని లాంటిదన్నారు. ఉద్యోగ, ఉపాధి పరిశ్రమ కడప ఉక్కు ద్వారానే ఇక్కడి యువతకు సాధ్యమన్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, కడప ఉక్కు కోసం ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. భవిష్యత్‌లో కడప ఉక్కు కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కడప కేంద్రంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ పోరాటంలో అందరూ కలసి రావాలని శివకుమార్ పిలుపునిస్తున్నామన్నారు. సమావేశంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌రాజ్, జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న వీరనాల శివకుమార్










